Jun 20,2023 00:20

మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం

ప్రజాశక్తి- చింతూరు
పోలవరం నిర్వాసితుల మహా పాదయాత్రలో రెడ్‌ షర్ట్‌ వాలంటీర్లదే కీలక పాత్ర అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం అన్నారు. పాదయాత్ర ఏర్పాట్లలో భాగంగా సోమవారం చింతూరు వచ్చిన ఆయన వెంకట్‌ రెడ్డి భవన్లో మీడియాతో మాట్లాడారు. నెల్లిపాక నుండి విజయవాడ వరకు 14 రోజులు 400 కిలోమీటర్లు ఈ మహా పాదయాత్ర జరుగుతుందని తెలిపారు. రెడ్‌ షర్ట్‌ వాలంటీర్లుగా ప్రతి మండలం నుండి 14 రోజులు నడిచేందుకు ముంపు నిర్వాసితులే సిద్ధమై వస్తున్నారని తెలిపారు. మంగళవారం నాటి సభకు వామపక్ష పార్టీలు, ప్రజా, గిరిజన ఆదివాసీ సంఘాల నాయకులు హాజరవుతారని చెప్పారు. యాత్రలో ప్రజానాట్యమండలి కళాకారులు, డప్పు కళాకారులు, ప్రజలను ఉత్సాహపరిచి ఆటపాట ద్వారా చైతన్య పరుస్తారని పేర్కొన్నారు. యాత్రకు పెద్ద ఎత్తున స్వాగతాలు పలికేందుకు ఊరూరా నిర్వాసితులు సన్నాహాలు చేసుకుంటున్నారని తెలిపారు. 26న రంపచోడవరం జిల్లా నుండి ఏలూరు జిల్లా రుద్రంకోటకు పాదయాత్ర చేరుకుంటుందని చెప్పారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి బొప్పన కిరణ్‌, నాయకులు పల్లపు వెంకట్‌, యర్రంశెట్టి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.
పోస్టర్‌ ఆవిష్కరణ
కూనవరం : మహాపాదయాత్ర వాల్‌ పోస్టర్లను మండల కేంద్రంలోని మార్తా శ్రీరామ్మూర్తి భవన్‌ సీపీఎం జిల్లా నాయకులు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా నాయకులు మేకల నాగేశ్వరరావు మాట్లాడుతూ పోలవరం ముంపు ప్రజలకు జరుగుతున్న మోసాన్ని తెలుగు రాష్ట్రాలకు చాటి చెప్పడానికి ఈ మహా పాదయాత్రను చేపట్టినట్లు తెలిపారు. ముంపు గ్రామాల ప్రజలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గారడీ చేస్తూ మోసం చేస్తున్నాయని విమర్శించారు. కాంటూరు, లైడార్‌ అని మోసపూరిత మాటలు చెబుతూ ముంపు ప్రజలను అయోమయంలో పడేస్తున్నాయని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి నిర్వాసితుడు ఈ పాదయాత్రలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి పాయం సీతారామయ్య, వైస్‌ ఎంపీపీ కొమరం పెంటయ్య, సీనియర్‌ నాయకులు తలగాని నాగరాజు, కుంజా రాధ, తాళ్లూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు.