ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ప్రాంగణంలోని జిల్లా రెడ్ క్రాస్ భవనంలో శనివారం ఛైర్మన్ బివి.కృష్ణారెడ్డి అధ్యక్షతన జిల్లా మేనేజింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ వై.ప్రసన్న వెంకటేష్ ఆదేశానుసారం జిల్లాలో తహశీల్దార్లు, ఎంపిడిఒలు అధ్యక్షతన రెడ్‌క్రాస్ సభ్యత్వం పొందిన వ్యక్తులతో మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలో ప్రతినెల రెడ్ క్రాస్ సంస్థ తరఫున ఒక ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చి దాతృత్వం చాటుకున్న కమిటీ సభ్యులకు కృష్ణారెడ్డి అభినందనలు తెలిపారు. త్వరలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం, యూత్ రెడ్ క్రాస్ విద్యార్థులకు ప్రథమ చికిత్స, విపత్తుల నిర్వహణ మీద శిక్షణను ఇచ్చే కార్యక్రమం, రెడ్ క్రాస్ సభ్యత్వాలు, డయాలసిస్ సెంటర్ ఏర్పాటు, రక్తదాన శిబిరాలు నిర్వహించడం వంటి అంశాలను కమిటీ చర్చించినట్లు కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో రెడ్ క్రాస్ కార్యదర్శి బి.బెన్నీ, డాక్టర్ ఆర్‌ఎస్‌ఆర్‌కె వరప్రసాదరావు, కమిటీ సభ్యులు రేవూరి శివప్రసాద్, టి.రామారావు, ఆర్‌ఎన్‌ఆర్ నాగేశ్వరరావు, చెన్న నాగభూషణం, బి.చిరంజీవి రావ్, బిఆర్‌సిహెచ్ నారాయణ పాల్గొన్నారు.










