Nov 16,2023 21:06

బోడికొండపై జరుగుతున్న గ్రానైట్‌ తవ్వకాలు

ప్రజాశక్తి- నెల్లిమర్ల :   మండలంలోని మైనింగ్‌ మాఫియా రెచ్చిపోతోంది. ఎటువంటి అనుమతులూ లేకుండానే ఇష్టానుసారంగా బోడి కొండను కొల్లగొడుతున్నారు. పైపెచ్చు ఎవరైనా ప్రశ్నిస్తే అనుమతులున్నాయని బుకాయిస్తున్నారు. ఈ విషయమంతా అధికారులకు తెలిసినా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు చెబుతున్నారు. స్థానిక నాయకులు కూడా పెద్ద ఎత్తున ముడుపులు తీసుకుని మిన్నికుండిపోయినట్లు తెలిస్తోంది. దీంతో మాఫియా ఇష్టానుసారంగా కొండను డొల్ల చేసి సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మండలంలోని మధుపాడ, అలుగోలు, జోగిరాజుపేట గ్రామాల సరిహద్దులోగల బోడి కొండను మైనింగ్‌ మాఫియా ఎటువంటి అనుమతులూ లేకుండానే తవ్వేస్తున్నారు. అత్యంత విలువైన యాంబర్‌ గోల్డ్‌ రకం గ్రానైట్‌ రాయిని తవ్వి తీస్తూ ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. సర్వే నెంబర్‌ 34లో 3.5 హెక్టార్లకు అనుమతులు తీసుకున్నామని నమ్మిస్తున్న మాఫియా గ్యాంగ్‌ అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలోనే తవ్వేస్తున్నట్లు ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు.
2010లో అనుమతులు తీసుకున్నారట !
అనుమతులు లేకుండా ఎందుకు కొండను తవ్వేస్తున్నారని ఎవరైనా ప్రశ్నిస్తే 2010లో అనుమతులు తీసుకున్నామని చెబుతున్నారు. అయితే కనీసం గ్రామసభ పెట్టకుండా స్థానిక నేతల నోళ్లను ఆమ్యామ్యాలతో మూయించి, గ్రామస్తులను ఏమార్చిన మైనింగ్‌ బడాబాబులు గత ఆరు నెలలుగా మొత్తం బోడి కొండను తవ్వేస్తున్నారు. కాగా మైనింగ్‌ తవ్వకాలకు రహదారి కోసం రైతుల జిరాయితీ భూములను సైతం కబ్జా చేసి పచ్చని చెట్లను నేలకూల్చి, వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. ప్రశ్నిస్తే రాజకీయ నేతల పేరుతో బెదిరిస్తున్నారని రైతులు వాపోతున్నారు.

   తరలింపునకు సిద్ధంగా ఉన్న గ్రానైట్‌ పలకలు
 
తరలింపునకు సిద్ధంగా ఉన్న గ్రానైట్‌ పలకలు

రాత్రి సమయాల్లో తరలింపు
పగటి పూట తవ్విన గ్రానైట్‌ అంతా రాత్రి సమయాల్లో పెద్ద పెద్ద కంటైనర్లతో బయటకు తరలించేస్తున్నారు. వారు చెప్పినట్లే అన్ని అనుమతులూ ఉంటే గప్‌ చుప్‌గా రాత్రి పూట ఎందుకు తరలిస్తున్నారని పలు అనుమానాలు వ్యక్తం మవుతున్నాయి.
బోడి కొండతో ఆ ప్రాంత ప్రజలకు విడదీయలేని బంధం
ఈ మూడు గ్రామాల మధ్య ఉన్న ఈ బోడి కొండతో ఆ ప్రాంత ప్రజలకు విడదీయరాని బంధం ఉంది. పశువుల మేతకు, వ్యవసాయ క్షేత్రంగా బోడి కొండను ఉపయోగిస్తోన్న రైతులు ఈ తవ్వకాలతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొండను ఆనుకొని ఉన్న డి-పట్టాదారులను కూడా మాఫియా కొనేసి ఏకంగా తవ్వకాలు చేస్తున్నట్లు తెలిస్తోంది. జోగిరాజుపేట, మధుపాడ, బొప్పడాం, పినతరిమి గ్రామాల భూభాగంతో కలిసి ఉన్న బోడి కొండ ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు ప్రజాప్రతినిధులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
అంతా నేతల కనుసన్నల్లోనే ..
ఈ మూడు గ్రామాలకు చెందిన స్థానిక నేతల కనుసన్నల్లోనే బోడికొండ తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కొంత మంది రైతుల నుంచి తీసుకున్న భూములకు, వాటి వల్ల పంట నష్టపోతున్న రైతులకు పరిహారం ఇవ్వకుండా మాఫియా దాటవేస్తుందని, పరిహారం ఇవ్వకపోతే చిన్న రాయిని కూడా వెళ్లనీయబోమని రైతులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అనుమతులు లేని మైనింగ్‌పై చర్యలు తీసుకుని పశువులకు ఆధారంగా ఉన్న బోడి కొండ తవ్వకాలను నిలిపివేయాలని ఆ మూడు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.