Mar 11,2021 07:10

విశాఖ ఉక్కు విషయంలో నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణి రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టేలా ఉంది. సమస్యను సామరస్యంగా పరిష్కరించడానికి బదులు కయ్యానికి కాలు దువ్వుతున్నట్లు కేంద్ర మంత్రుల ప్రకటనలు సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మిక సంఘాల పిలుపు మేరకు ప్రజానీకం ఉవ్వెత్తున ఎగిసి ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర బంద్‌ను జయప్రదం చేసిన తరువాత 'నూరు శాతం అమ్మేస్తాం' అంటూ సాక్షాత్తు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి ప్రకటన చేయడం, దానిపై భగ్గుమంటున్న వేళ 'ప్రైవేటీకరణ సాధ్యం కాకపోతే ప్లాంటును మూసివేస్తాం' అని ఆర్థికశాఖ సహాయమంత్రి బెదిరించడం తెలుగుజాతి ఆత్మగౌరవంపై దాడి చేయడంకాక మరేమిటి? ఇటువంటి ప్రకటనల వల్ల కేంద్ర ప్రభుత్వం సాధించదల్చుకుందేమిటి? తెగేవరకు లాగడమా! మోడీ ప్రభుత్వ ఉద్దేశ్యం అదేఅయితే నిప్పుతో చెలగాటమాడుతున్నారని చెప్పక తప్పదు. కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున నిధుల కేటాయింపులతో విశాఖ ప్లాంటును ఇవ్వలేదు. తమ ఆస్తి,పాస్తులు ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలు తెచ్చుకున్న ఫ్యాక్టరీ ఇది! ఈ ప్లాంటు మూలమూలలా ప్రజల త్యాగాలు కనిపిస్తాయి. ప్లాంటు సాధనకే కాదు, అభివృద్ధి, పరిరక్షణ కూడా ప్రజల పోరాటాలతోనే సాగింది. బహుశా దేశంలో మరే పరిశ్రమకు ఇటువంటి చరిత్ర లేదు! విశాఖ ఉక్కు ఒకటి, రెండు తరాల రాష్ట్ర ప్రజానీకానికి కన్నబిడ్డ! ప్రస్తుత తరానికి, రాబోయే తరాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపి ఆకలి తీర్చే తల్లి! అందుకే, విశాఖ ఉక్కు జోలికొస్తే ప్రజలు భగ్గుమంటారు. దీనిని కేవలం జీవం లేని ఫ్యాక్టరీగా భావిస్తే పొరపాటే! ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజల ఆత్మగౌరవ చిహ్నమిది! అందుకే మోడీ గురువు వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న కాలంలోనూ విశాఖ ఉక్కు జోలికొచ్చిన బిజెపికి చేతులు కాలాయి. అప్పట్లో తెలుగు ప్రజల ఆగ్రహానికి జడిసి వెనక్కి తగ్గిన కమలం నేతల కళ్లు రెండు దశాబ్దాల తరువాత మళ్లీ విశాఖ ఉక్కుపై పడ్డాయి. ప్రజాభిప్రాయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ప్రైవేటీకరణకు తెగబడుతున్నారు. ఈ ఏకపక్ష, నిరంకుశ వైఖరినే బిజెపి నాయకులు తమ సమర్థతకు చిహ్నంగా భావిస్తే తెలుగు ప్రజలు తిప్పికొట్టడం ఖాయం! 1962లో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపనకు హామీ ఇచ్చి ఆ తరువాత మొండిచెయ్యి చూపితే ఉవ్వెత్తున ఎగిసిన తెలుగు ప్రజలు ప్లాంటును సాధించుకున్నారు. నాటి పోరాటంలో 32 మంది అమరులవడంతో నాటి ప్రధాని దిగివచ్చి ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయక తప్పలేదు. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్‌ను 1984లో పదవీచ్యుతుడిని చేసినప్పడు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తిరగబడి సాధించుకున్న ఘనత ఇక్కడి ప్రజలది! తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని సవాల్‌ చేసిన ప్రతిసారీ కేంద్ర ప్రభుత్వానికి తల బొప్పి కట్టక తప్పలేదు. ఇప్పుడు జరిగేదీ అదే!
విశాఖ ఉక్కులో రాష్ట్ర ప్రభుత్వానికి నామమాత్రపు వాటా కూడా లేదని కేంద్రం తేల్చివేసింది. తెగనమ్మే ప్రక్రియలో చర్చించాల్సిన అవసరం లేదంటూ పూచికపుల్లకన్నా హీనంగా తీసిపారేసింది. అయినా, రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ప్రధానికి విజ్ఞప్తులు చేయడానికే ప్రాధాన్యత ఇస్తోంది. 'అఖిలపక్షం తీసుకువస్తాం... అనుమతివ్వండి' అంటూ తాజాగా రాసిన లేఖలో ఇదే ధోరణి వ్యక్తమైంది. ఈ వినతులకు, విజ్ఞప్తులకు స్పందించే స్థితిలో బిజెపి నేతలు ఉన్నారనుకుంటే పొరపాటే. తమ కార్పొరేట్‌ ప్రభువుల కోర్కెలను తీర్చే పనిలో వారు నిమగమైనారు. అధికార అహంకారంతో మూసుకుపోయిన వారి కళ్లు, చెవులను తెరిపించాలంటే సమైక్య పోరాటమే మార్గం! ఈ దిశలో ఇప్పటికే కార్మికలోకం కార్యాచరణను చేపట్టింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల మద్దతు ఇవ్వాలి. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కూడా కలిసిరావాలి. పొరుగున ఉన్న తెలంగాణ ప్రభుత్వం సైతం మనకు మద్దతుగా నిలబడుతోంది. కానీ, రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు సుందోపసుందుల్లా కాట్లాడుకుంటూ విశాఖ ఉక్కు పరిరక్షణకు రెండో ప్రాధాన్యతనే ఇస్తున్నాయి. ఇక జనసేన ఇప్పటికైనా బిజెపి బంధాన్ని తెగ్గొట్టుకుని ఉక్కు ఉద్యమంలో భాగం కావాలి. ఈ మూడు పార్టీలు కార్మికులకు అండదండగా ఇప్పటికే నిలిచిఉన్న వామపక్షాలతో కలిసి పోరాటంలోకి రావాలి. తమతో ఉన్న సమస్త శక్తులను కార్మికుల వెనుక మోహరింపచేయాలి. రాజకీయాలకు, జెండాలకు, ఎజెండాలకు అతీతంగా సాగే ఇటువంటి పోరాటమే కేంద్రం మెడలు వంచి, ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు కబంధ హస్తాల నుండి కాపాడుతుంది.