ప్రజాశక్తి-వన్‌టౌన్: రెడ్‌క్రాస్ సొసైటీ ప్రకతి విపత్తులకే కాకుండా సామాజికి వికాసానికి సైతం అపూర్వమైన సేవలందిస్తుందని ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్ ఛైర్మన్ డాక్టర్ ఏ శ్రీధర్‌రెడ్డి అన్నారు. రెడ్‌క్రాస్ సోసైటీ ఆర్‌ఈసీ లిమిటెడ్, కేబీఎన్ కళాశాల యూత్ రెడ్‌క్రాస్ వాలంటీర్లు, ఎన్‌ఎస్‌ఎస్ విభాగాల సహకారంతో 'ఆరోగ్యం - పరిశుభ్రత - పర్యావరణ' పేరుతో వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతతో పాటుగా పర్యావరణ సమస్యలపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన రాష్ట్రవ్యాపిత ప్రచార కార్యక్రమాన్ని మంగళవారం విజయవాడలో ప్రారంభించారు. అందులో భాగంగా పట్టణంలోని వివిధ మురికివాడల్లో మహిళలకు, పిల్లలకు, కౌమరదశలో ఉన్న బాలికలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించటంతో పాటుగా వారి వాలంటీర్ల ద్వారా కమ్యూనిటీ నిఘా చేపట్టనున్నారు. ఈ సందర్భంగా నగరంలోని ఎర్రకట్ట దిగువన ఉన్న ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ ఏ శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ సమాజంలోని వివిధ వెనుకబాటు కలిగిన ప్రాంతాల్లో ప్రజలకు ఆరోగ్యం, పర్యావరణ పరిస్థితులు తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈ క్యాంపెయిన్ చేపట్టనున్నట్లు చెప్పారు. ఆగస్టు 15వ తేదీన సుమారు ఐదు వేల మంది వాలంటీర్లతో సుమారు లక్ష ఇళ్లను కవర్ చేసే విధంగా ఈ క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే ఈ ప్రచార కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాపితంగా నిర్వహించనున్నట్లు వివరించారు. అంతేకాకుండా ప్రచారంలో భాగంగా డస్ట్‌బిన్ వ్యక్తిగత శుభ్రతకు సంబంధించిన కిట్లను అందించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి, రెడ్‌క్రాస్ సోసైటీ ఏపీ సీఈవో ఏకే పరిడా, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ విజయవాడ రీజియన్ అధికారిణి జయంతి, రెడ్‌క్రాస్ సోసైటీ ఏపీ బ్లడ్ బ్యాంక్ స్టేట్ కో-ఆర్డినేటర్ బీవీఎస్ కుమార్, కేబీఎన్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వీ. నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.










