నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేయడం మినహా మరో మార్గం లేదని తేలిపోయింది. రైతు సంఘాలు నిర్వహించిన ట్రాక్టర్ల పరేడ్ ఈ విషయాన్నే స్పష్టం చేసింది. గణతంత్ర దినోత్సవం నాడు జరిగిన ఈ మహా ప్రదర్శనను విఫలం చేయడానికి, ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి మోడీ సర్కారు పన్నిన కుట్రలను, కుతంత్రాలను రైతాంగం అడుగడుగునా తిప్పికొట్టింది. ఒక్కటిగా నిలిచి రాజీ లేని తమ ఆకాంక్షను విస్పష్టంగా వ్యక్తం చేసింది. వివిధ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం రెండు లక్షల మందికి పైగా రైతులు ఈ పరేడ్‌లో భాగస్వాములయ్యారు. అదే రోజు దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ రైతాంగానికి మద్దతుగా వివిధ కార్యక్రమాలు జరిగాయి. వీటిలో ఎక్కడికక్కడ వేలాదిమంది భాగస్వాములయ్యారు. దేశ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించవద్దని నినదించారు. దేశ ప్రజల మనోభీష్టం ఒక అంశంపై ఇంత స్పష్టంగా వెల్లడి కావడం అత్యంత అరుదు. ప్రజాస్వామ్యంపై గౌరవం ఉన్న ఏ ప్రభుత్వమైనా దీనిని గౌరవించి తీరాలి! కానీ, కేంద్రంలో ఉన్న నరేంద్రమోడీ ప్రభుత్వం దీనికి భిన్నంగా వ్యవహరిస్తోంది. ట్రాక్టర్ల పరేడ్ సందర్భంగా చోటుచేసుకున్న కొన్ని సంఘటనలను కారణంగా చూపి రైతు సంఘాలపై, నేతలపై కేసులు పెట్టడానికి, కక్ష సాధింపు చర్యలకు సిద్ధమౌతోంది.
ఇటువంటి భారీ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఒకటి, రెండు అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోవడానికి అవకాశాలుంటాయి. కానీ, ట్రాక్టర్ల పరేడ్‌లో చోటుచేసుకున్నవి అటువంటివి కావు! గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా అసాంఘిక శక్తులు ఈ తరహా విన్యాసాలకు దిగాయని ఇప్పటికే స్పష్టమౌతోంది. ఎర్రకోటలోకి ప్రవేశించి, జెండా ఎగురవేసిన వ్యక్తులకు బిజెపితో సంబంధాలున్నాయని వార్తలు రావడం, వారిలో ఒకరు సాక్షాత్తు ప్రధాని మోడీతో దిగిన ఫోటోలు వెలుగులోకి రావడం రైతు ఉద్యమాన్ని నీరుగార్చడానికి ఏ స్థాయిలో కుట్ర జరిగిందో తెలియచేస్తోంది. నిజానికి అసాంఘిక శక్తుల ప్రమేయం గురించిన అనుమానాలను కొద్ది రోజుల క్రితమే రైతు సంఘాలే వ్యక్తం చేసి, ఒకరిని పోలీసులకు కూడా పట్టివ్వడం ఈ సందర్భంగా గుర్తుచేసుకోవడం అవసరం. కుట్రలు, కుతంత్రాల గుజరాత్ వ్యూహాన్నే దేశమంతా అమలు చేయాలంటే కుదరదు! ఎవ్వరైనా ఒక్కసారి మోసపోతారు గానీ పదేపదే కాదుకదా! ఇది కాక, అనుమతిచ్చినట్టే ఇచ్చి ఆంక్షలు పెట్టడం, అడ్డంకులు సృష్టించడం, లాఠీఛార్జి, బాష్పవాయువు ప్రయోగం, వంటి రెచ్చగొట్టే చర్యలకు ఢిల్లీ పోలీసులు ఎవరి ఆదేశాలతో దిగారో ప్రజానీకం అర్ధం చేసుకోలేదా? 60 రోజులకు పైగా ఆందోళన చేస్తున్న లక్షలాది మంది సాధారణ ప్రజానీకంతో వ్యవహరించే పద్ధతేనా అది? రైతు మృతితో పాటు, ట్రాక్టర్ల పరేడ్ సందర్భంగా చోటుచేసుకున్న అన్ని అవాంఛనీయ సంఘటనలకు కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత!
వీటిని ఆధారం చేసుకుని రైతు ఉద్యమాన్ని నీరుగార్చడానికి, వారు లేవనెత్తిన డిమాండ్లను పక్కదోవ పట్టించడానికి జరుగుతున్న కుట్రల పట్ల ప్రజానీకం అప్రమత్తంగా ఉండాలి. సంఘపరివారంతో పాటు వారి కనుసన్నల్లో నడిచే కార్పొరేట్, సోషల్ మీడియా చేసే విష ప్రచారాన్ని తిప్పికొట్టాలి. కార్పొరేట్ రాబందుల నుండి దేశీయ వ్యవసాయ రంగ రక్షణకు మరింతగా అంకితం కావాలి. కేంద్ర ప్రభుత్వం కూడా అహంకార పూరిత వైఖరి విడనాడి దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్న ప్రజాభీష్టానికి పట్టం కట్టాలి. ప్రజాస్వామ్యంలో పాలకుల మౌలిక విధి కూడా ఇదే! ప్రజాభీష్టానికి తలగ్గలేనప్పుడు తప్పుకోవడమే మార్గం! ఏ మార్గం ఎంచుకుంటారో మోడీ ప్రభుత్వమే తేల్చుకోవాలి. దానికి భిన్నంగా నియంతృత్వ పోకడల తోటే కొనసాగుతామని అనుకున్నా, తప్పుడు ప్రచారాలతో, కుట్రలతో ఉద్యమాన్ని దెబ్బతీయాలనే రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక వైఖరిని కొనసాగించినా ప్రజాస్వామ్య భారతం సహించదు. తిరుగులేని గుణపాఠం నేర్పి తీరుతుంది.










