Nov 09,2023 23:49

ప్రజాశక్తి - బాపట్ల రూరల్
సారే జహా సే అచ్చా హిందూ సితా హమారా అంటూ భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పిన గీతాన్ని రచించిన అల్లమా మహమ్మద్ ఇక్బాల్ జయంతిని అంతర్జాతీయ ఉర్దూ భాష దినోత్సవంగా జరుపుకుంటారని ప్రముఖ ఉర్దూ సాహితీవేత్త, ఉర్దూ టీచర్ జనాబ్ షేక్ మహమ్మద్ ఖాసిం వివరించారు. ఉర్దూ భాష విశ్వవ్యాప్త భాషని అన్నారు. ఇది భారతదేశంలో జన్మించిందని అన్నారు. ఈ భాషను ప్రముఖ సూఫీ తత్వవేత్త అమీర్ ఖుస్రో అభివృద్ధి పరచారని తెలిపారు. సాహితీ భారతి ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ ఉర్దూ భాషా దినోత్సవ సభకు సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ అధ్యక్షత వహించారు. ప్రముఖ తెలుగు కవి దాశరధి తెలుగు, ఉర్దూ తనకు రెండు కళ్ళు వంటివని ప్రకటించారని అన్నారు. డాక్టర్ నారాయణరెడ్డి ఉర్దూలో ప్రసిద్ధి చెందిన గజల్ ప్రక్రియను తెలుగులో కూడా ప్రవేశపెట్టి ఉర్దూ విశిష్టతను తెలుగువారికి తెలియజేశారని అన్నారు. మర్రి మాల్యాద్రిరావు మాట్లాడుతూ ఉర్దూ భాష చాలా మృదు మధురమైన భాషని, భావ ప్రకటనకు, కవితా సృజనకు ఉర్దూ అత్యంత అనుకూలంగా ఉంటుందని ప్రశంసించారు. ప్రముఖ సాహితీ వేత్త అబ్దుల్ ఖాదర్ జిలాని మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వినియోగింపబడుతున్న భాషలో ఉర్దూ11వ స్థానంలో ఉందన్నారు. ఉర్దూ సాహిత్య ప్రక్రియకు చెందిన గజల్ రూబాయి అబాబీలు హైకులు వంటివి తెలుగులో కూడా ప్రజాదరణ పొందాయని అన్నారు. ఉర్దూలో సాహిత్యానికి నాలుగు జ్ఞాన పీఠ్ అవార్డులు లభించాయని తెలిపారు. ఈ సభలో ఆదం షఫీ, కస్తూరి శ్రీనివాసరావు, పువ్వాడ వెంకటేశ్వర్లు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, రెంటాల మురళి, రాధాకృష్ణమూర్తి, అవ్వారి వెంకటేశ్వర్లు ఉర్దూ భాష ప్రాముఖ్యతను గురించి ప్రసంగించారు.