ప్రజాశక్తి - మంత్రాలయం
మండలంలోని రచ్చుమర్రి గ్రామంలో దళితులకు రక్షణ కల్పించాలని కెవిపిఎస్ జిల్లా నాయకులు ఎమ్‌డి.అంజిబాబు, జిల్లా ఉపాధ్యక్షులు హెచ్.జయరాజు డిమాండ్ చేశారు. దళితులపై జరిగిన దాడి గురించి తెలుసుకునేందుకు బుధవారం గ్రామాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామంలో ఏరువాక పండగ సందర్భంగా జరిగిన పరుగు పందెంలో పాల్గొనేందుకు వచ్చిన దళితులను వాల్మీకులు అడ్డుకున్నారని తెలిపారు. పోటీల్లో పాల్గొనడానికి వీల్లేదని మాటమాటకు పెరిగి దళితులు శాంతి రాజు, ఏసేపుపై దాడి చేసినట్లు తెలిసిందన్నారు. ఈ ఘటనపై పోలీసులు 144 సెక్షన్ విధించారని, మానవత్వం మరిచి దళితుల ఇళ్లపైకి కట్టెలు, వేట కొడవళ్లతో దాడికి ప్రయత్నించారని చెప్పారు. దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్టు చేసి రిమాండ్‌కు పంపాలని డిమాండ్ చేశారు. ఇద్దరు దళితులపై పెట్టిన కౌంటర్ కేసులను ఎత్తేయాలని, రచ్చుమర్రి గ్రామంలో ఘర్షణలకు చోటు లేకుండా శాంతియుతంగా ఉండేటట్లు పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కెవిపిఎస్ నాయకులు మారెప్ప, సురేష్ రాజు, ఆంధ్రయ్య, విజరు, ప్రతాప్ పాల్గొన్నారు.
మాట్లాడుతున్న అంజిబాబు










