మంత్రి సమక్షంలో జడ్‌పిటిసిపై నాయకుల దాడి
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
ప్రజాశక్తి - రామచంద్రపురం
వైసిపిలో అంతర్గత విబేధాలు మరోమారు బహిర్గతమయ్యాయి. మంత్రి సమక్షంలోనే వైసిపి నాయకులు ఆ పార్టీ ప్రజాప్రతినిధిపై దాడికి దిగారు. బండ బూతులు తిడుతూ మంత్రిని సైతం బేఖాతరు చేస్తూ గలాటా సృష్టించారు. ఈ ఘటన మండలంలోని తోటపేటలో సోమవారం చోటు చేసుకుంది. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని తోటపేటలో సోమవారం ఉదయం 11 గంటలకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సమయంలో మంత్రి వేణుతో పాటు స్థానిక జడ్‌పిటిసి సభ్యుడు మెర్నీడి వెంకటేశ్వరరావు స్టేజీపైకి ఎక్కారు. ఈ సమయంలో గ్రామానికి చెందిన వైసిపి నాయకులు దామిశెట్టి గంగాపురుషోత్తం, అతని కుమారుడు సత్యనారాయణ జడ్‌పిటిసిపై ఆగ్రహంతో రగిలిపోయారు. జడ్‌పిటిసిని స్టేజీ ఎందుకు ఎక్కించారంటూ బండ బూతులు తిట్టారు. అంతటితో ఆగకుండా అందరూ చూస్తుండగానే జడ్‌పిటిసిపై చేయిచేసుకున్నారు. కుర్చీలు పైకెత్తి విసేరేందుకు విఫలయత్నం చేశారు. మంత్రి కలుగజేసుకుని ఇది మంచి పద్ధతి కాదని చెప్పినా వారు ఆగలేదు. 'నీ ఇష్టం వచ్చినట్టు మీటింగులు పెట్టుకో' అంటూ మంత్రిని కూడా పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. ద్రాక్షారామ ఎస్‌ఐ బి.వినోద్ పురుషోత్తాన్ని వారించినా వినిపించుకోలేదు. ఈ ఘటనపై జడ్‌పిటిసి సభ్యుడు వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేవారు. దామిశెట్టి గంగాపురుషోత్తం, అతని కుమారుడు సత్యనారాయణ తనను దూషిస్తూ దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన వెంట పలువురు వైసిపి నాయకులు, ఎపి ఐడిసి డైరెక్టర్ వాసంశెట్టి శ్యామ్, ఉపసర్పంచ్ ఎం.శ్రీనివాస్, వేగయమ్మపేట సర్పంచ్ అంబటి తుకారాం, చోడిశెట్టి శివాజీ, కోట వాసు, గుబ్బల శ్రీనివాస్, గురజా చిట్టిబాబు తదితరులున్నారు. కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.










