Jun 02,2021 06:53

    మావూరు పెద్ద గ్రామం అనే చెప్పాలి.పదిహేను వందల గడప. దాదాపు ఐదువేల జనాభా. ఊరికి రోడ్డు, కరెంటు ఉంది. ఊర్లో గ్రంధాలయం ఉంది. కాని గత పది, పదిహేను ఏళ్ళుగా దాని జోలికి ఎవరూ పోవడం లేదు. అంత తీరుబాటు ఎవరికీ లేదు. ప్రభుత్వాసుపత్రి ఉంది. కాని అక్కడికి పోయి వైద్యం చేయించుకునే వారిని ఊళ్ళో జనం చాలా జాలిగా చూస్తారు. '' పాపం ! వాడి పిల్లలు గవర్నమెంటు స్కూల్లో చదువుతున్నారు ! '' అని ఎంపిపి స్కూలుకి పిల్లల్ని పంపే తల్లిదండ్రుల గురించి అనుకుంటారు. దగ్గర్లో లేకపోయినా పట్నంలో ఉండే కార్పొరేట్‌ స్కూలు బస్సు మా వూరికొచ్చి పిల్లల్ని ఎక్కించుకుని వెళ్తుంది. ఊర్లో ప్రాక్టీసు చేసే ముగ్గురు డాక్టర్లూ తమదగ్గరకొచ్చే రోగుల్లో ఉన్న ఆందోళన బట్టి, వారి ఆర్ధిక స్తోమత బట్టి వాళ్ళని టౌన్‌ లో ఉన్న కార్పొరేట్‌ ఆస్పత్రులకు రిఫర్‌ చేస్తూ యధాశక్తి కమిషన్‌ లు తీసుకుంటూ ఉంటారు.
    ప్రశాంతతకు మా ఊరు మారుపేరు. ఎన్నికలొస్తే ఏ పార్టీకి అధికారం వచ్చే అవకాశం ఉందో స్పష్టంగా తేలేదాకా ఆగి ఆ తర్వాత కాబోయే అధికార పార్టీకి ఓటేస్తారు. ఆ తర్వాత మా ఓట్లతోనే ఫలానా నాయకుడు సిఎం అయ్యాడని గట్టిగా చెప్పుకుంటారు. ఊళ్ళో జనాల వ్యక్తిగత సమస్యలు ఏమున్నా పైరవీలతో, ఆమ్యామ్యాలతో పరిష్కరించడానికి కొందరు బ్రోకర్లు ఉండనేవున్నారు. సంఘాలు పెట్టండని, మీటింగులు జరుపుతాం రండి అని,
    ఉద్యమాలు చేద్దాం, సహకరించండి అని అప్పుడప్పుడు ఎర్రజెండాలవాళ్ళు వస్తారు కాని మేం వాళ్ళని పట్టించుకోం. విసిగిపోయి వాళ్ళే పోతారు.
ఇలాంటి మా ఊళ్ళో ఒక రచ్చబండ ఉంది. కాని అక్కడ ఈ మధ్య దాకా ఎవరూ చేరేవాళ్ళు కాదు. రచ్చబండ దగ్గర చేరడం, కష్టం, సుఖం మాట్లాడుకోవడం, తగువులు తీర్చుకోవడం వంటి అలవాట్లు గత ఇరవై ఏళ్ళుగా లేవు.
    కాని ఈ మధ్య అక్కడ జనం చేరడం ఒక్కసారి పెరిగింది. ఆ రచ్చబండ పక్కనే ఒక టీ కొట్టు లేచింది. కస్లమర్లు కూర్చొనేందుకు రచ్చబండనే కాస్త ఆకర్షణీయంగా చేసి, ''విలేజ్‌ ప్లాట్‌ఫాం'' అని బోర్డు పెట్టాడు. అక్కడ ఎవరైనా ఉచితంగా ఎంతసేపైనా కూచోవచ్చునని, వ్యక్తిగత విషయాలను కూడా గోప్యంగా మాట్లాడుకోవచ్చునని, అందుకు ఒక్క పైసా కూడా కట్టనక్కరలేదని బోర్డు పెట్టాడు. ఇదేదో కొత్తగా ఉందే అనుకుని ముందు కుర్రకారు, తర్వాత తక్కిన జనం అక్కడ చేరడం ప్రారంభించారు. ఇంట్లో టీవీ సీరియల్స్‌ చూసి చూసి బోరు కొట్టిన జనానికి ఆ ప్లాట్‌ఫాం దగ్గర చేరి కబుర్లతో కాలక్షేపం చయడం తమాషాగా, ఒక కొత్త ఫాషన్‌ గా అనిపించింది. '' అరె !నీకు ఈ ప్లాట్‌ఫాం తెలియదా !'' అంటూ అక్కడికి రానివాళ్ళ దగ్గర ఆశ్చర్యపడడం కూడా మొదలైంది. జనం పెరుగుతున్న కొద్దీ పోసుకోలు కబుర్లతో వాళ్ళకి ఎంటర్‌టైన్‌ మెంట్‌ కల్పించేవాళ్ళు తయారయారు. వాళ్ళెవ్వరూ ఒక్క పైసా కూడా వసూలు చేయకుండా వినోదం అందిస్తున్నారు. సినిమా కబుర్లు, క్రికెట్‌ కబుర్లు, అందరూ ఆసక్తికరంగా వినే రహస్య 'వ్యవహారాల '' కబుర్లు అన్నీ జనానికి అందుతున్నాయి.
    దాని చుట్టూ బ్యూటీ పార్లరు, క్లాత్‌ స్టోరు, చిన్నపాటి హోటళ్ళు, వచ్చాయి. అక్కడ ఒక ఆటో స్టాండు కూడా వచ్చింది. రెండేళ్ళ తర్వాత ఊరికి తిరిగొచ్చిన గుర్నాధం '' అబ్బా ! మన ఊరు బాగా డెవలప్పయిపోయిందే! '' అని తెగ ఆనందపడిపోయి అక్కడే కూచోడం మొదలెట్టాడు.
ఇంకో రెండేళ్ళలో ఎన్నికలనగా, ఆ రచ్చబండ దగ్గర కొందరు ఒకానొక భద్రయ్య అనేవాడి గురించి రోజూ మాట్లాడడం మొదలెట్టారు. భద్రయ్య గొప్ప సమర్ధుడని, స్వార్ధం అసలేమీ లేనివాడని, సాంప్రదాయాలంటే పడిచావడమేగాక, వాటిని ప్రశ్నించేవాళ్ళని అస్సలు సహించడని, తెగింపు ఉన్నవాడని - ఇలా రోజుకో కధగా భద్రయ్య గురించి చర్చ జరిగింది. అందర్లోనూ భద్రయ్య గురించి ఆసక్తి పెరిగింది. ఓ రోజు ఆ భద్రయ్య రానేవచ్చాడు. సాదా సీదాగా, సాంప్రదాయ దుస్తులతో ఉన్నాడు. అందరినీ బాగా తెలిసివున్నట్టే పలకరించాడు. తాను చెప్పేది వినాలని జనం చూస్తున్నారని రూఢి చేసుకున్నాక భద్రయ్య మా వూరు ఒకప్పుడు ఎంత గొప్పగా ఉండేదో చెప్పాడు. ( అతనింతకు ముందు మా వూరెప్పుడైనా వచ్చాడా అని అడుగుదామని కొందరనుకున్నా, అతని వాగ్ధాటికి ముగ్ధులైనందున ఆ విషయమే మరిచిపోయారు) అటువంటి మన వూరు ఇప్పుడు ఇలా దిగజారిపోవడం చాలా బాధాకరంగా ఉందన్నాడు. పూర్వ వైభవం తీసుకు రావలసిందేనన్నాడు. ఆ రోజుకి శలవు తీసుకున్నాడు.
'' ఎంత బాగా మాట్లాడేడు ! మన వూరి గురించి అతగాడు చెప్తూవుంటే వొళ్ళు పులకరించిందనుకో '' అన్నాడు గుర్నాధం. అలా తమకు వొళ్ళు పులకరించనందుకు కొందరు సిగ్గుపడ్డారు కూడా.
    మళ్ళీ ఆర్నెల్ల తర్వాత భద్రయ్య వచ్చాడు. ఈ సారి ఇంకాస్త ఎక్కువమంది గుమిగూడారు. భద్రయ్య ప్రసంగం గతం కన్నా ఉత్తేజపూరితంగా సాగింది. సరిహద్దుల్లో దేశం కోసం ప్రాణాలు త్యాగం చేస్తున్న వీర, అమర జవాన్ల గురించి మాట్లాడితే ఒకటే చప్పట్లు. పొరుగుదేశం కుట్రలను తిప్పికొట్టాలన్నప్పుడు యువకుల కండలు ఉప్పొంగాయి. భారత్‌ మాతా కీ జై అన్నారు వాళ్ళంతా. దేశాన్ని కాపాడడానికి భద్రయ్యలాంటివాళ్ళు అధికారంలో ఉండాల్సిందే అన్న అభిప్రాయం అప్పటికే కొందరిలో వచ్చేసింది.
    ఎన్నికలు దగ్గర పడ్డాయి. రచ్చబండ దగ్గర కార్యకలాపాలు బాగా పెరిగిపోయాయి. భద్రయ్య గురించి రోజూ ఒకటే చర్చ. అతడి భక్తులు పెరిగిపోయారు. పొరపాటున ఎవడైనా అక్కడ భద్రయ్య గురించి విమర్శిస్తూ మాట్లాడితే అతగాడి పనైపోయిందన్న మాటే. అలా మాట్లాడినవాడి మీద పడి నానా తిట్లూ తిట్టి అక్కడినుండి తరిమేసేవాళ్ళు. ఎన్నికలు ప్రకటించిన దగ్గర నుంచీ రచ్చబండ దగ్గర భద్రయ్య హోరు ఎక్కువైపోయింది. కాని విలేజ్‌ ప్లాట్‌ఫాం కల్చర్‌ కి అలవాటు పడిపోయినందున జనం ఎవరూ రచ్చబండకు రోజూ రాకుండా ఉండలేకపోతున్నారు.
ఎన్నికలు జరిగాయి. భద్రయ్య గెలిచాడని వేరే చెప్పాలా ?
     ఆ తర్వాత భద్రయ్య మావూరు రాలేదు. కాని అతడి ''మనసులో మాట'' మాత్రం విలేజ్‌ ప్లాట్‌ఫాం దగ్గర తప్పకుండా వినబడేది. ''స్వచ్ఛ వూరు'' అని అతగాడు పిలుపివ్వగానే, అందరూ చీపుళ్ళు పట్టుకుని తయారైపోయేరు. మీడియా సరేసరి. అక్కడ చెత్త లేకపోయినా, పక్కవూరినుండి రప్పించి మరీ దానిని తుడుస్తూ భద్రయ్య పిలుపును ఘనంగా జయప్రదం చేశారు. ఆ తర్వాత ఆత్మనిర్భరత నినాదం వచ్చింది. దానికి అర్ధం ఏమిటో తెలియక జనం తికమకపడ్డారు. కాని తెలియదని బైటికి అంటే ఎక్కడ పరువు పోతుందో అని భయపడి అందరూ ఆ మాటే నినాదంగా చేశారు. ఆ తర్వాత గంగా స్నానాలు, గోమూత్ర సేవనం, ఆవుపేడ లేపనం, చప్పట్లు కొట్టడం, దీపాలు వెలిగించడం, శంఖాలు ఊదడం వంటి పనులు చాలా చేశారు. ఈ మధ్యలో మళ్ళా ఎన్నికలు జరగడం, మళ్ళా భద్రయ్య గెలవడం అంతా జరిగిపోయింది.
     ఇప్పుడు రచ్చబండ - అదే - విలేజ్‌ ప్లాట్‌ఫాం దగ్గర అంతా బాగానే ఉన్నట్టు కనపడినా, ఇళ్ళ దగ్గర మాత్రం తేడా కొడుతోంది. డబ్బులు చాలడం లేదు. బళ్ళమీద హుషారుగా తిరిగే కుర్రాళ్ళకి పెట్రోలు ధర మంట పుట్టించేస్తోంది. ఇక రైతుల సంగతి చెప్పనక్కర్లేదు. పనులు లేక నీరసంగా ఉన్నవాళ్ళ సంఖ్య బాగా పెరిగింది. జబ్బు చేసిన వాళ్ళకి కార్పొరేట్‌ ఆస్పత్రికి పోయే ధైర్యమూ లేదు, పోకుండా ఉండిపోయే నిబ్బరమూ లేదు.
     మెల్లిగా విలేజ్‌ ప్లాట్‌ఫాం దగ్గర చేరేవాళ్ళు భద్రయ్య పై విమర్శలు ప్రారంభించారు. ఇన్నేళ్ళలో అతగాడు ప్రజలకి ఉపయోగపడే పని ఒక్కటైనా చేశాడా అని నిలదీయడం మొదలెట్టారు. మావూరు రాకమునుపు వేరే వూర్లో అతగాడు గెలిచి అక్కడ సాగించిన దారుణాల గురించిన కథలు ఒకటొక్కటీ బైటకు వస్తున్నాయి. భద్రయ్య మాటలపోగే తప్ప చేతల్లో వేస్టు అన్న విషయం విలేజ్‌ ప్లాట్‌ఫాం దగ్గర బాగా చర్చిస్తున్నారు. భద్రయ్య ను బలపరిచేవాళ్ళూ ఉన్నా ఇప్పుడు వాళ్ళకి విలువ లేకుండా పోయింది.
    భద్రయ్య కి విలేజ్‌ ప్లాట్‌ఫాం దగ్గర వాతావరణం మారిన వార్త తెలిసింది. బాధ పడ్డాడు. 'మనసులో మాట ' చెప్తున్నప్పుడు కన్నీరు కార్చాడు. కాని జనం దగ్గర ఆ మంత్రం ఈ సారి పని చేయలేదు. గెలిచాక ఇలా ఏడవడం ఎనిమిదోసారి. మొదటి ఏడుపుకి వచ్చిన ఎఫెక్టు ఇప్పుడు రావడం లేదు. పైగా ఏడుపు గొట్టు భద్రయ్య అనేస్తున్నారు. మరేం చెయ్యాలి ?
    అనుంగు మిత్రుడు టక్కు టమారం తో మంత్రాంగం చేసేడు. అసలు ఈ విలేజ్‌ ప్లాట్‌ఫాం దగ్గర కొందరు దేశద్రోహులు చేరి తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నందువల్లనే జనాలలో పొరపాటు అభిప్రాయాలు కలుగుతున్నాయని టక్కుటమారం చెప్పేడు. వెంటనే భద్రయ్య విలేజ్‌ ప్లాట్‌ఫాం దగ్గర తనకు తెలియకుండా, తన అనుమతి లేకుండా, ఏ విషయం మాట్టాడుకున్నా అది నేరం అని ప్రకటించాడు. కొందరిమీద కేసులు బనాయించి జైల్లో పెట్టాడు.
    విలేజ్‌ ప్లాట్‌ఫాం క్రమంగా పల్చబడిపోవడం మొదలైంది. కాని జనాలు మాట్లాడుకోవడం మానలేదు. ఇళ్ళ దగ్గర, తుప్పల్లో, డొంకల్లో, ఎక్కడ కుదిరితే అక్కడ, ఎప్పుడు బడితే అప్పుడు కొత్త కొత్త పద్ధతుల్లో చర్చలు జరుపుతున్నారు. పరిస్థితి భద్రయ్య కు అంతుపట్టకుండా పోయింది. మళ్ళీ ఎన్నికలొస్తున్నాయి. విలేజ్‌ ప్లాట్‌ఫాం గతంలో తనకు ఉపయోగపడింది. కాని దానిని తానే కొరగాకుండా చేసుకున్నాడు. ఇప్పుడు తనకు ప్రచారం ఎలా ? విలేజ్‌ ప్లాట్‌ఫాం దగ్గరే ఎంత పెద్ద మైకు పెట్టి అరిచి గీ పెట్టినా వినేదెవడు ? నమ్మేదెవడు ?
     ఎవరైనా మీలో భద్రయ్య 'మనసులో మాట' కు డైలాగులు రాయగలరా ? నిజాలను దాచిపెట్టి జనాల్ని నమ్మించగలరా? ప్లీజ్‌ ! మీకు బొత్తిగా దేశభక్తి లేదా ? మీరిలాగే ఉంటే ప్రపంచ దేశాలు మనగురించి ఏమనుకుంటాయి ? హన్నా !