ప్రజాశక్తి-గుంటూరు : ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు, రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగినంతగా లేని కారణంగా రబీలో సాగునీటి సరఫరా ఉండదని, నీటి అవసరం తక్కువగా వుండే పప్పుధాన్య రకాలైన మినుము, పెసర పంటలనే సాగు చేసుకోవాలని జిల్లాలోని రైతులను కోరుతూ జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి వెల్లడించారు. కలక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన జిల్లా నీటి పారుదల సలహా మండలి, వ్యవసాయ సలహామండలి ప్రత్యేక సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 10.20 టీఎంసీలు, నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 26.13 టీఎంసీలు, పులిచింతల ప్రాజెక్టులో 10.29 టీఎంసీలు మాత్రమే వినియోగించుకోవడానికి అందుబాటులో ఉన్నాయని, వీటిని తాగునీటి అవసరాలకే వినియోగించనున్నామని చెప్పారు. అందువల్ల రబీలో నాగార్జున సాగర్ ఆయకట్టుకు, కష్ణా పశ్చిమ డెల్టా ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేయబోమని ఇరిగేషన్ అధికారులు తెలిపారని చెప్పారు. జిల్లాలో నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రాంత రైతులు నీటి అవసరం లేని శనగ, మినుములు కృష్ణా పశ్చిమ డెల్టా ఆయకట్టు రైతులు మినుము, పెసర వంటి పంటలను మాత్రమే సాగు చేసుకోవాలన్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు, రిజర్వాయర్లలో నీటి లభ్యతపై రైతు భరోసా కేంద్రాల స్థాయి, మండల స్థాయిలోనూ వారంలోపు రైతులతో ప్రత్యేకంగా వ్యవసాయ, ఇరిగేషన్ అధికారులు సమావేశాలు నిర్వహించి రబీలో నీటి అవసరం లేని పంటల సాగుపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసిన వరి కోతలు ముగిసే సమయానికంటే ముందుగానే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని పౌర సరఫరాల శాఖాధికారులను కలెక్టర్ ఆదేశించారు. అధిక ధరలకు విత్తనాలను వ్యాపారులు విక్రయించడకుండా వ్యవసాయ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ ఎన్.శివరామకృష్ణ మాట్లాడుతూ రబీలో నీటి అవసరం లేని మినుము, పెసర పంటలలో మేలు రకాలను రైతులకు సిఫార్సు చేయడంతో పాటు అవసరమైన విత్తనాలను రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో వుంచేలా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎన్.వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ ఎస్‌ఇ ఉమామహేశ్వరరావు, ఏపీఎంఐపీ ప్రాజెక్టు మేనేజర్ వజ్రశ్రీ, జిల్లా ఉద్యానశాఖాధికారి రవీందర్, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజరు జి.లక్ష్మీ, ఏపీ సీడ్స్ జిల్లా మేనేజర్ సుబ్బయ్య, ఆత్మ డీడీ రామాంజనేయులు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి