Nov 16,2023 21:37

వెంగళరాయసాగర్‌లో తగ్గిన నీటి మట్టం

ప్రజావక్తి - మక్కువ :  సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ఈ ఏడాది రబీకి సాగునీటి సరఫరా కష్టంగానే ఉంది. వర్షాభావం ఒక కారణమైతే, కాలువల ఆధునీకరణ మరో కారణంగా కావడంతో రబీసాగు రైతుకు శాపంగా మారింది. దీంతో రైతులు రబీసాగు పట్ల ఆశలు వదులుకున్నారు.
మక్కువ మండలంలోని మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు వెంగళరాయసాగర్‌ నుండి రబీ వరి సాగు కోసం సాగునీరు రావడం కష్టమేనని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు ఆధునీకరణ కోసం సుమారు రూ.60.5 కోట్లు జైకా నిధులు మంజూరయ్యాయి. అందులో భాగంగా ఈ ఏడాది కుడి ప్రధాన కాలువలో 20 శాతం మేరకు లైనింగ్‌ పనులు పూర్తి చేశారు. ఖరీఫ్‌ కాలం రావడంతో ఆ పనులను అర్ధాంతరంగా నిలిపివేశారు. ఖరీఫ్‌కు సాగునీరు విడుదల చేసే సమయంలో ఈ ఏడాది నవంబర్‌ 15 వరకు మాత్రమే ప్రాజెక్టు నుండి సాగునీరు విడుదల జరుగుతుందని అప్పట్లో అధికారులు ప్రకటించారు. అయితే తీవ్ర వర్షాభావం నెలకొనడంతో ఇంకా బొబ్బిలి మండలంలోని శివారు ఆయకట్టు భూములకు సాగునీరు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇంకా నీరు విడుదల కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో సుమారు పదివేల ఎకరాల వరకు రబీ పంటకు సాగునీరందించేందుకు అవసరమయ్యే నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంకా ఖరీఫ్‌ కొనసాగుతున్నందున ఇప్పట్లో రబీ సాగునీరు ప్రస్తావన అధికారుల్లో రానట్లు తెలుస్తోంది. సుమారు 24,800 ఎకరాలకు సాగునీరందించే సామర్ధ్యం ఆయకట్టుకు ఉన్నప్పటికీ కాలువలు సరిగ్గా లేకపోవడంతో ఖరీఫ్‌ కూడా సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. ఈసారైనా జైకా నిధులతో కాలువల పనులు పూర్తి చేస్తే పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరందగలదన్న ఆశాభావం రైతుల్లో వ్యక్తమవుతుంది
ఆక్విడెక్టకు మోక్షం కలిగేనా..?
ఎడమ ప్రధాన బ్రాంచ్‌ కాలువ పరిధిలోని గోముఖి నదిపై ఆక్విడక్ట్‌ నిర్మాణం జరిగి ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న ఆయకట్టు రైతులకు సాగునీరు అందుతుందా అన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. కోట్లాది రూపాయల నిధులతో చేపడుతున్న ఆధునీకరణలో భాగంగా ఆక్విడెక్టు నిర్మాణానికి ప్రతిపాదన ఉండడం ఈ ఆయికట్టు రైతుల్లో ఆశలు చిగురింప చేస్తుంది. కొన్ని ఏళ్లుగా సుమారు 4,500 ఎకరాలు ఆయకట్ట రైతులకు చుక్కనీరు అందని పరిస్థితి. ఇందులో కొంత భాగం లింకు చానల్‌ ద్వారా నీటి సరఫరా జరిగినా అది అంతంత మాత్రమేనని రైతులు ఉంటున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ వహించి గోముఖీ నదిపై ఆక్విడెక్టు నిర్మించి ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
రబీకు సాగునీరు కష్టమే
పాచిపెంట : మండలంలోని పెద్దగెడ్డ జలాశయం ద్వారా రబీకి సాగునీరివ్వడం కష్టమేనని ఇరిగేషన్‌ అధికారులు తేల్చి చెబుతున్నారు. ప్రధానంగా వర్షాభావం వల్ల నీటిమట్టం పూర్తిగా తగ్గిపోవడమే. జలాశయం పూర్తి నీటిమట్టం 213.8 మీటర్ల కాగా, ప్రస్తుతం 208 మీటర్లు నీటిమట్టం ఉంది. రానున్న రోజుల్లో నీటిమట్టం పూర్తిగా తగ్గే అవకాశాలుండడంతో రబీకి సాగునీరివ్వడం కష్టమేనని డిఇఇ పి.కనకారావు తెలిపారు. రైతులు మాత్రం రబీకి సాగునీటి కోసం ఎదురుచూస్తున్నారు. ఈ జలాశయం ద్వారా పాచిపెంట, సాలూరు, రామభద్రపురం మండలాల పరిధిలోని 12వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. జలాశయం ఆధునీకరణ పనులు జరగకపోవడంతో ఈ ఏడాది ఖరీఫ్‌కు శివారు భూములకు నీరు సక్రమంగా అందలేదని రైతులు వాపోతున్నారు. ఆధునీకరణ పనులు ప్రారంభించి మూడేళ్లయిన 30 శాతం పనులు కూడా పూర్తి కాకపోవడంతో సాగు రైతులు ఆందోళన చెందుతున్నారు. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వల్ల గుత్తేదారులు పనులు వేగవంతం చేయడం లేదు. అలాగే జైకా నిధులు మళ్లింపులు జరిగాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఈ ఏడాది పెద్దగెడ్డ జలాశయం ద్వారా రబీకి సాగునీరు కష్టమే.