Nov 15,2023 21:55

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి ఈ ఏడాది రబీ సాగుకు అవసరమైన సాగునీటిని పూర్తిస్థాయిలో సరఫరా చేసేందుకు తగు ప్రణాళికను సిద్ధం చేశామని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాసవేణు గోపాలకృష్ణ, హోం మంత్రి డాక్టర్‌ తానేటి వనిత తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో రబీకి సంబంధించి జిల్లా స్థాయి నీటి పారుదల సలహా మండలి సమావేశం కలెక్టర్‌ కె.మాధవీలత అధ్యక్షతన జరిగింది. ఈ సమా వేశంలో జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి వేణుగోపాల్‌ కృష్ణ, హోం మంత్రి తానేటి వనిత, జడ్‌పి ఛైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు, ఎంపీ మార్గాని భరత్‌రామ్‌, డిసిసిబి ఛైర్మన్‌ ఆకుల వీర్రాజు, ఎంఎల్‌ఎలు జక్కంపూడి రాజా, సత్తి సూర్య నారాయణ రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైైర్మన్‌ బూరుగుపల్లి సుబ్బారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుత రబీ సీజన్లో వరికి అనుకూలంగా ఉన్న 64,361 ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. నీటి ఎద్దడి వచ్చినా ఎదుర్కొనే విధంగా సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సిఎం ఆదేశాల మేరకు ఏ ఒక్క ఎకరాకు నీటి లభ్యత లేని కారణంగా పంట వేయకుండా ఉండకూడదదని స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా అవసరమైన నిధులను సమకూర్చుతామని సిఎం హామీ ఇచ్చారన్నారు. నీటి లభ్యత ఎక్కడ ఉంది, వాటిని ఎలా సమీకరించాలి, రైతులకు బాసటగా ఎలా నిలవగలం అనే ఆలోచనతో వైసిపి ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. నవంబర్‌ నెలాఖరు నాటికి ఖరీఫ్‌ కోతలు పూర్తి చేసి, డిసెంబర్‌ 1 నుంచి 10 లోగా రబీకి నాట్లు కోసం రైతులను సిద్ధం చేయాలని ఆదేశించారు. డిసెంబర్‌ 31 నాటికి నాట్లు పూర్తయ్యేలా అవగాహన కల్పించాలన్నారు. పోలవరం ప్రాజెక్టు కింద రైతుల అవసరాలకు అనుగుణంగా నీటి నిల్వలు ఎలా ఉంచాలనే అంశంపైనా చర్చించి, ఆ మేరకు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ప్రతిపాదించినట్లు మంత్రి వేణు తెలిపారు. హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ ప్రతి ఒక్క నీటి బొట్టు వినియోగిం చుకోవాల్సిఉందన్నారు. ప్రతి నియోజక వర్గ పరిధిలో ఆయ కట్టుకు సాగునీరు అందించే సామర్థ్యం పెంచుకోవాలని సూచించారు.
కలెక్టర్‌ మాధవీలత మాట్లాడుతూ ఖరీఫ్‌ సీజన్లో చివరి వరకు సాగునీరు అందించి ఇరిగేషన్‌ అధికారులు ఎంతో సహకారం అందించారని తెలిపారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రానున్న రబీ సీజన్‌ డిసెంబర్‌ 1 నుంచి మార్చి నెలాఖరు వరకు జరగనున్న దృష్ట్యా సాగునీటి వనరుల కోసం ఈ సమావేశంలో చర్చించామన్నారు. మండల స్థాయి వ్యవ సాయ సలహా మండలి సమావేశాలను నవంబర్‌ నెలాఖరు, డిసెంబర్‌ రెండో వారంలో నిర్వహించి డిసెంబర్‌ నెలలో నాట్లు పూర్తి చేసేలా అవగాహన కల్పించడంపై తీర్మానం చేసినట్లు తెలిపారు. లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కింద మోటార్ల రిపేర్లు, క్రాస్‌ బండ్‌ ఏర్పాట్లు, డీ సిల్టింగ్‌, డీ వీడింగ్‌, షట్టర్స్‌, స్లూయజ్‌ తదితర 20 పనులకు రూ.1.03కోట్లతో ప్రతిపాదన చేశామన్నారు. అంతకు ముందు గోదావరి తూర్పు డెల్టా 2,64,507 ఎకరాలు, గోదావరి సెంట్రల్‌ డెల్టా కింద 1.72లక్షలు, గోదావరి వెస్ట్రన్‌ డెల్టా కింద 4.60 ఎకరాలు మొత్తంగా గోదావరి డెల్టా సిస్టమ్‌ కింద రబీ ఆయ కట్టు ద్వారా 8,96,507 ఎకరాలకు 91.35 టిఎంసి సాగునీరు అందించాల్సి ఉంటుందన్నారు. సాగునీటి అవసరాలకు 82.49 టిఎంసిలు అందుబాటులో ఉండగా, మిగిలిన 8.86 టిఎంసి ల టర్న్‌ సిస్టమ్‌ (వరభాండి సిస్టమ్‌) నీటి పొదుపు అమలు ద్వారా 5 టిఎంసిలు, కాలువలపై క్రాస్‌ బండ్‌లు, డీజిల్‌ పంపులను ఉప యోగించి నీటిని ఎత్తివేయడం ద్వారా 3.86 టిఎంసిల నీటిని ఉప యోగించుకునే అవకాశం ఉందన్నారు. తద్వారా రబీకి నీటి కొరతను తీర్చడానికి కార్యాచరణ ప్రణాళికను తయారు చేశామని తెలిపారు.