
ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఈ ఏడాది రబీ సాగుకు రైతులకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. వేర్వేరు కారణాల వల్ల ఖరీఫ్‌లో ఏ పంట వేయలేక ఖాళీగా ఉన్న భూముల్లో రబీ సాగుకు సమాయత్తమైన రైతులకు వర్షాభావం సమస్యగా మారింది. ఏ పంటలు వేయాలో పాలుపోక సతమతమవుతున్నారు. అపరాలు మినహా ఇతర ఆహార ధాన్యాలు, నూనెగింజలు, వాణిజ్య పంటలను సాగు చేసే పరిస్థితి లేదు. గుంటూరు జిల్లాలో దాదాపు 90 వేల ఎకరాల్లో ఏ పంటలు వేయక ఖాళీగా ఉన్న భూముల్లో జొన్న, మొక్కజొన్న సాగుకు రైతులు ఉపక్రమించగా అధికారులు వేరే పంటలు సాగు చేసుకోవాలని సూచిస్తున్నారు.
పులిచింతలలో నీటి నిల్వలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఖరీఫ్‌లో ఇంకా 16 టీఎంసీలు డెల్టాకు అవసరం. ప్రస్తుతం ఉన్న 30 టీఎంసీలు కేవలం వరి పంటను కాపాడుకునేందుకు సరిపోతాయని, తరువాత తాగునీటికి కూడా ఇబ్బంది వస్తుందని అందువల్ల పూర్తిగా ఆరుతడి పంటలే వేసుకోవాలని జలవనరుల శాఖ అధికారులు స్పష్టం చేశారు. దీంతో రైతులు మినుము, పెసర సాగుకు పూర్తిగా మొగ్గు చూపడం లేదు. పల్నాడు జిల్లాలో దాదాపు 2.45 లక్షల ఎకరాల భూమి ఖాళీగా ఉంది. ఇప్పటికే సాగు చేసిన వరి, మిర్చి, పత్తి, కంది తదితర పంటలను కాపాడుకునేందుకు నీరు వస్తుందా? రాదా? అనే సంశయంలో ఉన్న రైతులు రబీ సాగుపై ముందుకు వెళ్లలేకపోతున్నారు. పల్నాడు జిల్లాలో రబీలో ప్రధానంగా జొన్న, మొక్కజొన్న సాగు చేస్తారు. ఈసారి కూడా ఇందుకు రైతులు సిద్ధమైన నేపథ్యంలో అధికారులు చేస్తున్న హెచ్చరికలతో రైతులు వెనక్కి తగ్గుతున్నారు. అక్టోబరు చివర వారం నుంచి నవంబరు రెండో వారంలోగా తుపాన్లు ఏమైనా సంభవిస్తే కొంత వరకు వర్షాభావం తొలగిపోవచ్చునని భావిస్తున్నారు. రానున్న నెల రోజుల్లో తుపాన్లు రాకపోతే మాత్రం ఈ ఏడాది రబీ సాగుకు కూడా తీవ్ర ఇబ్బందులు తప్పకపోవచ్చునని అధికారులు అంగీకరిస్తున్నారు.
2003లో ఏర్పడిన కరువు పరిస్థితులు 20 ఏళ్ల తరువాత మళ్లీ ఏర్పడ్డాయని పల్నాడు ప్రాంత రైతులు చెబుతున్నారు. ఖరీఫ్‌లో వెంటాడిన కష్టాలే రబీ సీజన్‌లోనూ పునరావృత్తం అవుతుండటంతో రైతులకు ఎటూ పాలుపోవడం లేదు. ఇప్పటికే జిల్లాలో 15 రోజులుగా వర్షాల్లేవు. ఖరీఫ్‌లో సాగు చేసిన వరి, మిర్చి, పత్తి, కంది,పసుపు పైర్లకు చాలినంత నీటి లభ్యత లేక దిగుబడి తగ్గిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రెండు జిల్లాల పరిధిలో ఖరీఫ్‌లో ఏ పంట వేయని 3.45 లక్షల ఎకరాల్లో రబీ సాగు ప్రశ్నార్థకంగా మారింది. వాస్తవంగా రెండు జిల్లాల పరిధిలో వరి కోతలు పూర్తయిన తరువాత రబీ పంటలుగా జొన్న, మొక్కజొన్న సాగు చేయడం అనవాయితీ. ఈ ఏడాది డెల్టాలో వరి సాగు చేసిన ఐదు లక్షల ఎకరాల్లో జొన్న, మొక్క.జొన్న కాకుండా మినుము,పెసర వేసుకోవాలనే సూచనలను ఎంత వరకు ఆచరణ సాధ్యం అవుతాయనేది చర్చనీయాంశంగా మారింది.