
రాయచోటి : 2023-24 రబీ సీజన్ సన్నద్ధతలో భాగంగా జిల్లాలో 11 వేల క్వింటాళ్ల ఉలవ రాయితీ విత్తనాలను రైతులకు పంపిణీ చేశామని కలెక్టర్ గిరీష పి.ఎస్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డికి వివరించారు. గురువారం వ్యవసాయం, పశుసంవర్ధక, డెయిరీ డెవలప్మెంట్, రెవెన్యూ, రీసర్వే, జాతీయ రహదారులకు భూ సేకరణ, ఎంపిఎఫ్‌సి గోడౌన్‌లకు భూ కేటాయింపు, ప్రాధాన్యత భవనాలు, ఉపాధి హామీలో వేజ్ జనరేషన్, జల్ జీవన్ మిషన్, జగనన్నకు చెబుదాం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్‌లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి ఆయా అంశాలలో దిశా నిర్దేశం చేశారు. రాయచోటి కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ గిరీష పిఎస్, జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్, డిఆర్‌ఓ సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రాయితీ విత్తనాలు, ఎరువులు పూర్తిగా అందుబాటులో ఉన్నాయని, వర్షాభావం కారణంగా రైతులందరూ సాగు పూర్తిగా చేయడం లేదని తెలిపారు. 2023-24కు సంబంధించి రబీ ప్రణాళికను వ్యవసాయ శాఖ సిద్ధం చేసిందని చెప్పారు. జిల్లాలో ఇప్పటికే వందశాతం ఈక్రాప్ బుకింగ్, రైతుల ఇకెవైసి పూర్తి చేశామన్నారు. ఈనెల 15 నుంచి 19 వరకు గ్రామసభలు నిర్వహిస్తామని, రైతుల నుంచి అందిన ఫిర్యాదులను అక్టోబర్ 23 లోపల పరిష్కరించి ఈనెల 25న ఆర్బీకేలలో జాబితాను ప్రదర్శిస్తామని వివరించారు. గ్రామాలలో విరివిగా ఉపాధి హామీ పనులు కల్పించాలని డ్వామా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. జగనన్న పాల వెల్లువ క్రింద మహిళలకు రుణాలు, అలాగే పాడిరైతులకు సహకార బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరుకు తగు చర్యలు తీసుకోవడం జరుగుతోందని చెప్పారు. జాతీయ రహదాలకు సంబంధించి భూసేకరణ, పరిహారం చెల్లింపులను వేగవంతం చేస్తున్నామన్నారు. రీ సర్వేలో భాగంగా గ్రామాల సరిహద్దులు ఫైనలైజ్ అయిన చోట హద్దురాళ్లను నాటేందుకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. అసైన్‌మెంట్ మాడ్యుల్స్, సర్వీస్ ఇనాం మాడ్యుల్స్ ను నిబంధనల మేరకు లక్ష్యాన్ని సాధించేందుకు కషి చేస్తున్నట్లు తెలిపారు. వీడియో కాన్ఫిడెన్స్‌లో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.