Sep 27,2023 23:21

వినతిపత్రం ఇస్తున్న నాయకులు

ప్రజాశక్తి - క్రోసూరు : సాగర్‌ ఆయకట్టులో ఖరీఫ్‌లో సాగవ్వని పొలాలకు రబీలోనైనా సాగు నీరు ఇవ్వాలని, ఈ మేరకు వ్యవసాయ ప్రణాళికను విడుదల చేయాలని రైతు సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు తహశృల్దార్‌ కార్యాలయంలో బుధవారం వినతిపత్రం ఇచ్చారు. సంఘం పల్నాడు జిల్లా నాయకులు ఎ.ఆంజనేయులు మాట్లాడుతూ మండలంలోని దొడ్లేరు రెవెన్యూ పరిధిలో పెరికపాడు, దొడ్లేరు, ఆవులవారిపాలెం గ్రామాల పరిధిలో సాగర్‌ కాల్వ కింద సాగయ్యే భూమిలో 3/4 వంతు భూమి ఖాళీగా ఉందన్నారు. ఈ పొలాలకు రబీలో నీరివ్వడంతోపాటు విత్తనాలు, ఎరువులను సబ్సిడీపై సరఫరా చేయాలని కోరారు. పంటలు సాగవ్వని నేపథ్యంలో వ్యవసాయ కూలీలకు పనుల్లేకుండా పోయాయని, వలసెళ్లాల్సిన దుస్థితి నెలకొందని, వీరికి ఉపాధి హామీ పనులు చూపాలని కోరారు. ఖరీఫ్‌లో వేసిన పైర్లకు ఆరు తడికింద అయినా నీరివ్వాలన్నారు. పంటల బీమాకు గతంలో ప్రభుత్వమే ప్రీమియం చెల్లించేందని, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ విధానాలకు తలోగ్గి, ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిందని, ఈ విధానాన్ని మానుకోవాలని కోరారు. కార్యక్రమంలో కౌలురైతు సంఘం మండల కార్యదర్శి టి.హనుమంతరావు, నాయ కులు డి.నటరాజు, కె.లక్ష్మయ్య, జె.పేతురు పాల్గొన్నారు.