
ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : కృష్ణా పశ్చిమ డెల్టాలో రబీ సాగు అగమ్యగోచరంగా మారింది. గతనెల రోజులుగా వర్షం కురవకపోవడంతో రెండో పంటగా సాగు చేయాల్సిన రబీలో ఏ పంటలు వేయాలలో అర్థమవ్వగా రైతుల్లో అయోమయం నెలకొంది. వర్షం అవసరమైనప్పుడు కురవకపోవడంతో ఖరీఫ్‌లో సాగు చేసిన పైర్లు ఎదుగుదల, దిగుబడిపై ప్రతికూల ప్రభావం పడుతోంది. గత 24 రోజులుగా జిల్లాలో కనీసవర్షం కురవ లేదు. అక్టోబరులో 129.4 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా ఇప్పటి వరకు 15.8 మిల్లీ మీటర్ల వర్షపాతమే నమోదైంది. వర్షాభావం ప్రభావం అటు ఖరీఫ్, ఇటు రబీపైర్లపై పడుతోంది.
గుంటూరు జిల్లాలో 1.40 లక్షల ఎకరాల్లో సాగు చేసిన వరి కోతల తరువాత రబీలో జొన్న, మొక్కజొన్న సాగు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది వర్షాభావంతో వరి పైరు ఇప్పటికే బెట్టకొచ్చింది. కొన్నిచోట్ల పొట్టదశకు రావడంతో నీటి అవసరం పెరిగింది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజి నుంచి 9,379 క్యూసెక్కుల నీటిని తూర్పు, పశ్చిమ డెల్టాలకు విడుదల చేస్తున్నారు. పశ్చిమ డెల్టాపరిధిలో గుంటూరు, బాపట్ల జిల్లాలు ఉన్నాయి. తూర్పు డెల్టా పరిధిలో ఉమ్మడి కృష్ణా జిల్లా ఉంది. పశ్చిమ డెల్టాకు మంగళవారం 4209 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. తూర్పు డెల్టాకు 5,085 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పులిచింతల నుంచి ఆరు వేల క్యూసెక్కులు, పట్టిసీమ నుంచి 3 వేల క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజీకి వస్తోంది. దీంతో డెల్టాకు కొంత మేరకు ఉపశమనం కల్గుతోంది. కానీ చివరి భూములకు నీరందడం లేదు. అంతేగాక డెల్టాకాల్వల మరమ్మతుల సకాలంలో చేయకపోవడం వల్ల కూడా ఇబ్బంది పొలాలకునీరు అందడంలేదు. ఎక్కువ మంది రైతులు ఆయిల్ ఇంజన్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. దీని వల్ల రైతులకు ఖర్చులు పెరుగుతున్నాయి.
మరోవైపు పత్తి, మిర్చి పైర్లు వర్షాభావం వల్ల బెట్టకు వచ్చాయి. మెట్ట ప్రాంతంలో సాగర్ కాల్వలకు నీరు రాకపోవడం వల్ల ఈ పైర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రధానంగా తాడికొండ, పత్తిపాడు నియోజకవర్గాల్లోని సాగర్ కాల్వలకు చివర ఉన్న దాదాపు 50 గ్రామాల్లో పైర్లు ఎండిపోయే పరిస్థితి కనిపిస్తోంది. 45 వేల ఎకరాల్లో పత్తి, 25 వేల ఎకరాల్లో మిర్చి పైర్లను కాపాడుకునేందుకు రైతులు అవస్థ పడుతున్నారు. మిర్చికి అధిక పెట్టుబడి పెట్టడం వల్ల మొక్కలను బతికించుకునేందుకు చెరువులు, కుంటల్లోని నీటిని కడవలతో తీసుకువచ్చి వినియోగిస్తున్నారు. అక్టోబరులో తుపాన్లు వస్తాయని చాలామంది మెట్ట ప్రాంతంలో పత్తి, మిర్చి, ఇతర పంటలను సాగు చేయగా ఈ నెలలో ఇప్పటి వరకు వర్షం లేకపోవడం వల్ల పైర్లను బతికించుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. వేసిన పైరును ఎలా కాపాడుకోవాలన్న అంశంలో ఒక్కొ రైతు ఒక్కోవిధంగా ఇబ్బంది పడుతున్నారు. నిద్రహారాలు మానివేసి ఉదయాన్నే పొలం బాట పడుతున్నారు. ఖరీఫ్‌లో వర్షాభావం తీవ్ర రూపం దాల్చినందున రెండో పంటగా రబీ సాగులో జొన్న, మొక్కజొన్న సాగు చేయొద్దని, కేవలం మినుము, పెసర, శనగ సాగు చేయాలని వ్యవసాయశాఖ జిల్లా అధికారి ఎన్.వెంకటేశ్వర్లు సూచించారు.
జిల్లాలో గత ఐదు నెలల్లో వర్షపాతం వివరాలు (మిల్లీ మీటర్లలో)
నెల అవసరం నమోదు
జూన్ 97.1 105.8
జులై 164.9 255.2
ఆగస్టు 164.7 102.7
సెప్టెంబరు 145.2 202.3
అక్టోబరు 100.2 15.8