Nov 20,2023 00:58

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఈ ఏడాది రబీ సాగు మందగమనంగా ఉంది. సీజన్‌ ప్రారంభమై 40 రోజులు దాటినా ఇంత వరకు సేద్యం ఊపందుకోలేదు. గుంటూరు జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో రబీ పంటలు సాగు చేస్తారని అధికారులు అంచనా వేయగా గత 40 రోజుల్లో కేవలం 6 వేల ఎకరాల్లోనే వేశారు. పల్నాడు జిల్లాలో 1.40 లక్షల ఎకరాల్లో పంటలేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 1200 ఎకరాల్లోనే సాగు చేశారు. వర్షాభావం కొనసాగడం వల్ల ఖరీఫ్‌లో ఏ పంటలు వేయకుండా ఖాళీగా ఉంచిన భూముల్లో కూడా ఏపంటలు వేయలేదు. పల్నాడులో మూడు లక్షల ఎకరాలు, గుంటూరు జిల్లాలో లక్ష ఎకరాల్లో భూములు ఖాళీగా ఉన్నా రబీలో కూడా ఇప్పటి వరకు సాగు ఊపందుకోలేదు.
ఖరీఫ్‌లో ఏ పంటలు వేయకపోయినా రబీలో ఆరుతడి పంటలు వేసినా ఎంతో కొంత మేలు జరుగుతుందని భావించినా గత రెండు నెలలుగా వర్షాలు లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జలాశయాల్లో నీటి నిల్వలు పడిపోవడంతో సాగర్‌ ఆయకట్టు పరిధిలో ఈ ఏడాది రబీలో కేవలం మినుము, పెసర తప్ప మిగతా పంటలకు అనుమతి లేదని అధికారులు తెలిపారు.అలాగే డెల్టాలో వరి తరువాత సాగు చేసే జొన్న,మొక్క.జొన్నకు ఈఏడాది అనుమతి లేదని అధికారులు ప్రకటించారు. అంతేగాక వరి కోతలు పూర్తయిన వెంటనే రబీ పంటలు వేయడం ఆనావాయితీగా ఉన్నా ఈ ఏడాది డెల్టాలో కూడా చాలా ప్రాంతాల్లో భూములు బెట్టకు రావడం వల్ల మినుము, పెసర, శనగ తదితరపంటలు సాగుకు కూడా రైతులు తర్జన భర్జనలు పడుతున్నారు. పులిచింతలలో కూడా నీటి నిల్వలు 14 టిఎంసిలకు తగ్గిపోవడం వల్ల ఈనీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాల్సి ఉన్నందున రబీ పంటలకు నీరు ఇవ్వలేమని అధికారులు తెలిపారు. దీంతో డెల్టాలో వరి తరువాత జొన్న, మొక్కజొన్నపై రైతులు ఆశలు వదులుకున్నారు.
పల్నాడు ప్రాంతంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఖరీఫ్‌ ప్రారంభం నుంచి పల్నాడును కరవు వెంటాడుతోంది. గత ఆరునెలల కాలం కాలంలో కనీస వర్షపాతం నమోదు కాని పరిస్థితి నెలకొంది. అక్టోబరు, నవంబరులో కనీస వర్షపాతం నమోదు కాలేదు.అంతేకాకుండా ప్రతి ఏటా అక్టోబరు, నవంబరు నెలల్లో తుపాను రావడం అనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది గత రెండు నెలల కాలంలో తుపాను ప్రభావం ఉమ్మడి గుంటూరు జిల్లాపై ఏమాత్రం కనిపించలేదు. కనీస వర్షపాతం నమోదు కాకపోవడం వల్ల రబీ సాగుకు తీవ్ర ఆటంకంగా మారింది.

గుంటూరు జిల్లాలో రబీ సాగు వివరాలు (ఎకరాల్లో)
పంట సాగు చేయాల్సింది సాగైంది
వరి 2800 0
శనగ 21,000 2100
మినుము 13,500 2800
పొగాకు 2000 40
పెసర 27000 0
జొన్న 52000 40
మొక్కజొన్న51000 20
ఇతర 15,000 2000
పల్నాడు జిల్లాలో
వరి 72000 40
శనగ 26,000 1100
మినుము 5000 45
పొగాకు ా 6000 1300
పెసర 1280 0
జొన్న : 7500 3200
మొక్కజొన్న 20,000 40
కంది : 5000 0
ఇతర : 10,000 2200