Apr 24,2023 02:20
మొక్కజొన్న పంట దిగుబడులను పరిశీలిస్తున్న సురేష్‌

ప్రజాశక్తి-భట్టిప్రోలు (కొల్లూరు): ఈ ఏడాది రబీలో సాగు చేసిన జొన్న, మొక్కజొన్న పంటలతో పాటు పసుపు సాగు చెందిన రైతులకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి అకాల వర్షాలకు గురికాకుండా రాయితీపై టార్పాలిన్‌ పట్టాలు అందజేయాలని కౌలు రైతు సంఘం బాపట్ల జిల్లా నాయకులు తోడేటి సురేష్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం కొల్లూరు మండలం అనంతవరం, క్రాప, రావికంపాడు, చినపులివర్రు గ్రామాలలో పర్యటించి రైతులు కల్లాలలో ఆరబోసిన మొక్కజొన్న పంటను పరిశీలించారు. ఓ పక్క పండిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవటం,మరో ప్రక్క సంభవించిన అకాల వర్షంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నామని అటు రైతులు, ఇటు కౌలు రైతులు సురేష్‌ ఎదుట వాపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెలరోజుల క్రితం కురిసిన వర్షానికి డెల్టా ప్రాంతంలో అనేక చోట్ల మొక్కజొన్న దెబ్బతిని దిగుబడులు తీవ్రంగా తగ్గిపోయాయన్నారు. దీనికి తోడు పది రోజుల నుండి వ్యాపారస్తులు సిండికేట్‌ గా ఏర్పడి రోజుకొరకంగా ధరలో కోత విధిస్తూ రైతులను దోసుకుంటున్నారని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకోవాలని కోరారు. లేకుంటే కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు పొలాల్లో ఉన్న పంటను కాపాడుకోవడానికి తక్షణం టార్ఫాలిన్‌ పట్టాలు అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతులు సిహెచ్‌ శివరామ కృష్ణ, పోతార్లంక బాజి, గుర్రం వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.