ప్రజాశక్తి - భీమడోలు
మండలంలో రబీ వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మరోవైపు సార్వా ధాన్యం కొనుగోళ్లు ముగింపు దశకు చేరుకున్నాయి. మండలంలో 28,850 టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యమవ్వగా అది దాదాపు పూర్తయినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఇక రబీ విషయానికి వస్తే మండలంలో గత సీజన్ మాదిరిగానే ప్రస్తుత సీజన్లో 13,736 ఎకరాల విస్తీర్ణంలో సాగుకు వ్యవసాయ ప్రణాళిక సిద్ధం చేశామని వ్యవసాయాధికారి ఉషారాణి తెలిపారు. దీనికోసం 636 ఎకరాల విస్తీర్ణంలో నారుమళ్లు వేయాల్సి ఉండగా 85 శాతం నారుమడులు వేసే కార్యక్రమం పూర్తయ్యిందన్నారు. మండల పరిధిలో ఇంతవరకు 350 ఎకరాల విస్తీర్ణంలో నాట్లు వేసే కార్యక్రమం పూర్తయ్యిందన్నారు. ప్రస్తుతం సాగు చేస్తున్న రైతులు గతంలో మాదిరిగా ఇ-క్రాప్‌లో నమోదు కావాలని సూచించారు. ఇక రైతుల కోసం అవసరమైన ఎరువులు, విత్తనాలు, ఇతరాలను రైతుభరోసా కేంద్రాల వద్ద ఉంచినట్లు తెలిపారు. అలాగే ఆర్‌బికెల వద్ద వ్యవసాయ సహాయకులు అందుబాటులో ఉటారని వివరించారు.










