
ప్రజాశక్తి-తెనాలి : అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులు పరిహారం కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ ఏడాది రబీలో పంట చేతికొచ్చే సమయంలో కురిసిన భారీ వర్షాలు రైతుల వెన్ను విరిచాయి. జొన్న, మొక్కజొన్న రైతులు భారీగా నష్టపోయారు. పంటనష్టం అంచనాలు వేసిన అధికారులు ఇప్పటికీ పరిహారం చెల్లించలేదు.
రైతులు, కౌలు రైతులు పంట పెట్టుబడులకు పోగా మిగులు ఆశించేది రబీ సీజన్‌లోనే. రబీలో దాదాపుగా తెనాలి ప్రాంతంలో జొన్న, మొక్కజొన్న అధికంగా సాగు చేశారు. పంట చేతికొస్తుందన్న తరుణంలో మే మొదటి వారంలో వర్షాలకు జొన్న, మొక్కజొన్న కళ్లాల మీద తడిసిపోయింది. కొంత పంట నిలువునా కూడా తడిసింది. దీంతో రైతులకు రూపాయి కూడా దక్కలేదు. ఖరీఫ్ పెట్టుబడుల అప్పులు పోగా, రబీలో ఇంటి ఖర్చులకు మిగులుతాయని ఆశించిన రైతులకు కంట కన్నీరే మిగిలింది.
దెబ్బతిన్న పంటలను గుంటూరు జిల్లా వ్యవసాయాధికారి నున్నా వెంకటేశ్వర్లు సారధ్యంలో మే 12న పరిశీలించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు 33 శాతానికి పైగా దెబ్బతిన్న పంటల నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి పంపుతామని ప్రకటించారు. అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపినా పరిహారం మాత్రం ఇప్పటికీ దక్కలేదు.
ఇదిలా ఉండగా పంటలను ఏపి రైతు సంఘం నాయకులు పరిశీలించి బాధిత రైతులతో మాట్లాడారు. ఎకరాకు కనీసం రూ.20 వేలు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా దెబ్బతిన్న పంటలను పరిశీలించి, రైతులను ఆదుకోవాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే పరిహారం చెల్లింపులో వ్యవసాయశాఖ, మార్క్‌ఫెడ్ ఒకరిమీద ఒకరు చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.
వ్యవసాయ కమిషనర్ కార్యాలయం చుట్టూ రైతులు ప్రదక్షిణలు
పంట నష్ట పరిహారం ఇప్పటికీ దక్కలేదంటూ రైతులు వ్యవసాయ కమిషనర్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జొన్న, మొక్కజొన్న కళ్లాల మీద తడిసిన దానికి పంటనష్టం అంచనా వేశారని, వారి లెక్కల ప్రకారం ఎకరా జొన్న, మొక్కజొన్నకు రూ.12,500 వరకూ పరిహారం వస్తుందని అధికారులు వెల్లడించినట్లు రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం నిధులను విడుదల చేసినా రైతుల ఖాతాలకు జమ కాలేదనే వాదనలూ కొందరు రైతుల నుంచి వినిపిస్తున్నాయి.
ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్నారు.
మేకల చిట్టిబాబు, కౌలురైతు, తెనాలి
అకాల వర్షాలకు రబీలో తీవ్రంగా నష్టపోయాం. అధికారులు పంట నష్టం అంచనా వేసినా పరిహారం మాత్రం ఇప్పటికీ చెల్లించలేదు. వ్యవసాయ శాఖ అధికారులు మార్క్‌ఫెడ్‌పై చెబుతున్నారు. మార్క్‌ఫెడ్ అధికారులు వ్యవసాయ శాఖపై చెబుతున్నారు. ఇటీవలే వ్యవసాయ కమిషనర్‌ను కూడా కలిశాం. క్యాబినెట్ సమావేశం అనంతరం స్పష్టత వస్తుందని అక్కడి అధికారులు చెప్పారు. వాస్తవానికి కళ్లంలో ఆరబోసిన పంట తడిసన దానికి మాత్రమే లెక్కగట్టారు. అదేమంటే 33 శాతం పైగా దెబ్బతిన్న పంటనే పరిహారానికి అంచనా వేస్తున్నట్లు చెప్పారు. అధికారులు వెల్లడించిన లెక్కల ప్రకారం ఎకరానికి రూ.12500 చెల్లిస్తారని చెప్పారు. అదికూడా ఇప్పటికీ రైతులకు చేరలేదు. ప్రభుత్వం నిధులు విడుదల చేశామని చెపుతున్నా పరిహారం రైతులకు చేరకపోవటంపై ఆంతర్యమేమిటో అధికారులకే తెలియాలి.
మార్క్‌ఫెడ్ చెల్లిస్తామంది... ఇప్పుడు మాపై పెట్టింది
జి.విద్యాసాగర్, వ్యవసాయాధికారి, తెనాలి
పంట నష్టాన్ని అంచనా వేశాం. పరిహారం హెక్టారుకు జొన్నకు రూ.7500, మొక్కజొన్నకు రూ.12000 ప్రతిపాదించి, ప్రభుత్వానికి ప్రతిపాదించాం. అయితే పరిహారం అంచనాలు రెండు రకాలుగా జరిగింది. మొదటిది పరిహారం, రెండవది పోస్ట్ హార్వెస్టింగ్ లాస్‌గా పరిగణించారు. పరిహారం ఇప్పటికే కొంతమంది రైతులకు చెల్లింపులు జరిగాయి, మిగిలిన వారికి కూడా చెల్లింపులు జరుగుతున్నాయి. ఇక పోస్ట్ హార్వెస్టింగ్ లాస్‌ను మొదట మార్క్‌ఫెడ్ అధికారులు చెల్లిస్తామన్నారు. ఇప్పుడు వ్యవసాయ శాఖే చెల్లించాలని చెబుతున్నారు. ఇది ఎక్కువ మొత్తంలో ఉంది. అది కూడా త్వరలో చెల్లించేందుకు చర్యలు తీసుకుంటాం.
తీరని అన్యాయం చేస్తున్నారు
ఎం.శివసాంబిరెడ్డి, రైతు సంఘం గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు.
రైతు ప్రభుత్వంగా చెప్పుకుంటున్న వైసిపి ప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేస్తోంది. రబీలో పంట నష్టపోతే ఇప్పటికీ పరిహారం ఇవ్వకపోవడం దారుణం. పంట చేతికి రాక, వచ్చిన పంటకు మద్దతు ధర లేక రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారు. అప్పులపాలైన వారికి పరిహారం అందక విలవిల్లాడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రబీలో జొన్న, మొక్కజొన్న నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందించి ఆదుకోవాలి.