ప్రజాశక్తి-భట్టిప్రోలు: రబీ సీజన్‌లో సాగుచేసిన మొక్కజొన్న పంట కురుస్తున్న వర్షాలకు వర్షార్పణం అయ్యింది. కొందరు రైతులు కండెలను గుట్టలుగా పోసి పరదాలు కప్పినా వర్షాలకు తడిసి గుట్టలలోనే వేడెక్కి గింజ రంగు మారుతుంది. అదే రీతిలో కొందరు పొలంలోనే ఉంచటంతో నిత్యం కురుస్తున్న వర్షాలకు మొలకెత్తి రైతును ఆందోళనకు గురి చేస్తోంది. శనివారం భారీ నుంచి అతి భారీ వర్షం కురిసి మరింత ఆందోళనకు గురిచేసింది. ఇదిలా వుండగా వేమూరు నియోజకవర్గంలో అన్ని మండలాల్లో మొక్కజొన్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. భట్టిప్రోలులో పరదాలపై ఆరబోసిన గింజలు తడిసి బూజుపట్టి రంగు మారింది. కొల్లూరు మండలం క్రాపలో పొలంలోనే కండే ఓదేలు తడిచి రేఖలో నుండే గింజలు మొలకేతాయి. ప్రస్తుతం రైతు పరిస్థితి ముందు గొయ్యి వెనుక నుయ్యి అన్న చందంగా మారిందని వాపోతున్నారు. కండె గుట్టలు పోసి పరదాలు కప్పినా తేమ అధికమై దెబ్బతింటుందని, పరదాలు తెరచి ఆరబెడితే ఎప్పుడు వర్షం వస్తుందో తెలియటం లేదని ఆందోళన చెందుతున్నారు. ధైర్యం చేసి కండెను గింజలు చేస్తే నిరంతర వర్షానికి గింజ ఫంగస్‌కు గురై దెబ్బతింటుందని వాపోతున్నారు.
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి: కౌలు రైతు సంఘం
గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు దెబ్బతింటున్న మొక్కజొన్న పంటలను కొనుగోలు చేసేందుకు తక్షణమే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని బాపట్ల జిల్లా కౌలు రైతు సంఘం అధ్యక్షులు తోడేటి సురేష్ డిమాండ్ చేశారు. వేమూరు మండలం వెళ్లబాడు, కొల్లూరు మండలం రావికంపాడు గ్రామాలలో శనివారం ఆయన పర్యటించి మొక్కజొన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెల్టా ప్రాంతంలో పంటలను సాగు చేసేవారిలో 70 శాతం పైగా కౌలు రైతులే ఉన్నారని ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు తీవ్రంగా నష్టపోయేది కౌలు దారులేనన్నారు. దెబ్బతిన్న రంగుమారిన మొక్కజొన్నను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చెయ్యాలని కోరారు. ఈయన వెంట కౌలు రైతులు మునిపల్లి కోటేశ్వరరావు, కొడాలి శ్రీను ఉన్నారు. అదేవిధంగా భట్టిప్రోలు మండలం ఓలేరు గ్రామంలో ఎంపిపి డివి లలితకుమారి, జెడ్పిటిసి టి ఉదరు భాస్కరి, సర్పంచ్ మెరుగు రంగారావు, ఏఓ మిరయ్యలు మొక్కజొన్న పంటను పరిశీలించారు.










