ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి అన్నదాతలను సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. ఖరీఫ్ సీజన్‌లో తీవ్ర వర్షాభావం నెలకొంది. జూన్ నుంచి జిల్లాలో లోటు వర్షపాతం నమోదవుతోంది. జూన్‌లో 52.7, ఆగస్టులో 61.1, సెప్టెంబరులో 18.1, అక్టోబరులో 88.0 లోటు వర్షపాతం నమోదయ్యింది. మరోవైపు కాలువల ద్వారా నీరు సక్రమంగా అందని పరిస్థితుల్లో ప్రస్తుతం పలు ప్రాంతాల్లో వరి, ఇతర పంటలు ఎండిపోయాయి. ప్రధానంగా మెట్ట మండలాల్లో రూ.వేలల్లో పెట్టుబడులు పెట్టగా నష్టపోయారు. ఇప్పుడు జిల్లావ్యాప్తంగా రబీకు నీటి గండం తప్పేలా లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురవకపోవడం ఒక కారణం కాగా సాగునీటి కాలువలు అధ్వానంగా మారాయి. పెద్ద ఎత్తున పూడిక పేరుకుపోయి అధికారుల నిర్లక్ష్య వైఖరిని వెక్కిరిస్తున్నాయి.
జిల్లాలో 21 మండలాల్లో ఈ ఏడాది 2.30 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యింది. వర్షాలు లేకపోవడంతో సుమారు 30 వేల ఎకరాల్లో రైతులు వరి పంట వేయలేదు. మెట్ట మండలాలైన తుని, కోటనందురు, రౌతులపూడి, తొండంగి, జగ్గంపేట, శంఖవరం ప్రాంతాల్లో కరువు తాండవిస్తోంది. 39 వేల ఎకరాల్లో వరి సాధారణ విస్తీర్ణం కాగా 30 వేల ఎకరాల్లో పంట వేశారు. ఈ ఏడాది వర్షాలు లేక వేసిన పంటలకు నీరు పూర్తిగా అందక పంటలు ఎండిపోయి భారీ నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రబీకి సాగు నీరందేనా..?
పుష్కర ఎత్తిపోతల పథకం పరిధిలోని తాళ్లూరు లిఫ్ట్ ఆయకట్టు కింద జగ్గంపేట మండలంలో ఈ ఖరీఫ్ సీజన్లో 6 గ్రామాల్లో సుమారు 30 వేల ఎకరాల్లో వరి ఎండిపోయింది. దీనిపై నష్టపరిహారం ఇప్పించాలని రైతులు ఆందోళన చేసినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. చెరువులు సైతం ఎండిపోవడంతో కనీసం పశువుల తాగునీటికైనా ఇబ్బందులు లేకుండా చూడాలని రైతాంగం విజ్ఞప్తి చేస్తుంది. ఏలేరు ప్రాజెక్టు సాగు నీటి ఆధారంగా జగ్గంపేట, పెద్దాపురం, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం నియోజకవర్గాల్లోని దాదాపు 53 వేల ఎకరాల్లో పంటలు పండుతున్నాయి. ప్రస్తుతం సరిపడా సాగునీరు ఉన్నా ఫేజ్-1, ఫేజ్-2లలో రూ.394 కోట్ల నిధులతో అభివద్ధి పనులు జరగకపోవడంతో ఎక్కడికక్కడ కాలువలు ఆధునీకరణకు నోచుకోలేదు. ప్రధాన కాలువతో సహా పిల్ల కాలువల్లో సైతం భారీ ఎత్తున గుర్రపు డెక్క, పూడిక పేరుకుపోయింది. ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో సాగునీరు సక్రమంగా అందడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రత్తిపాడు మండలం పరిధిలో ఉన్న సుబ్బారెడ్డి సాగర్ క్రింద 10 వేల ఎకరాలు సాగు చేస్తున్నారు. 20 గ్రామాలకు ఈ సాగర్ నీరే ఆధారం. మరమ్మతుల పనులు చేయక 2 వేల ఎకరాలకు మాత్రమే నీరు అందింది.మిగిలిన 7 వేల ఎకరాల్లో పంటలు ఎండుముఖం పట్టాయి. తుని, కోటనందూరు, రౌతులపూడి మండలాలకు తాండవ నీరు ప్రస్తుతం అరకొరగానే వస్తుంది.
ఖరీఫ్‌కే పరిస్థితి ఇలా ఉంటే వచ్చే రబీకి జిల్లాలో సాగునీరు అందే పరిస్థితి కనిపించడం లేదు. గతేడాది జిల్లాలో 1.63 లక్షల ఎకరాల్లో రబీ సాగు జరగ్గా ఈ ఏడాది ప్రశ్నర్దంకంగా మారింది.