అనంతపురం ప్రతినిధి : ఖరీఫ్‌లో మొదలైన వర్షాభావం రబీలోనూ కొనసాగుతోంది. వర్షాభావం అక్టోబర్ నెలలోనూ నెలకొనడంతో రబీ సాగు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో తక్కువ విస్తీర్ణంలోనే రబీ సాగు అవుతున్నప్పటికీ నల్లరేగడి నెలల్లో పప్పుశనగ ప్రధానంగా సాగయ్యేది. ఈ పంట సాగుకు అక్టోబరు ఆఖరుకే కీలకమైన సమయం. నవంబరు మొదటి వారం దాటితే అంత అనువైన సమయం కాదని వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. ఇప్పటి వరకు చినుకు జాడ లేకపోవడంతో ఇకపై రబీ సాగు ముందుకు సాగే అవకాశాలు కనిపించడం లేదు.
ఐదు శాతంలోపే సాగు
అనంతపురం జిల్లా పరిధిలో రబీలో 3.04 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. ఇందులో ప్రధానంగా 1.93 లక్షల ఎకరాల్లో పప్పుశనగ పంట సాగవుతుంది. ఆ తరువాత స్థానం వేరుశనగ పంటది ఉంటుంది. అది కూడా బోరు బావుల కింద ఇతర పంటలు సాగవుతాయి. కాని ఇప్పటి వరకు చూస్తే కేవలం 16,600 ఎకరాల్లో మాత్రమే పప్పుశనగ పంట సాగైంది. అంటే సాధరణంలో ఐదు శాతం మాత్రమే విత్తనం పడింది. వేరుశనగ అయితే 50 వేల ఎకరాల్లో సాధారణ సాగు కాగా, ఇప్పటి వరకు ఒక్క ఎకరంలోనూ విత్తనం పడలేదు. ఇక సత్యసాయి జిల్లాలో రబీ సాధారణ సాగు 69వేల ఎకరాలు. ఇందులో ఇక్కడ ప్రధానంగా వేరుశనగ పంటయే రబీలో సాగవుతుంది. 43 వేల ఎకరాలు సాధారణ వేరుశగయే ఉంటుంది. వర్షాల్లేక భూగర్బ జలాలు తగ్గిపోయే సూచనలు కనిపిస్తుండటంతో ఇక్కడా వేరుశనగ సాగు చేయాలా.. వద్దా అన్న మీమాంస రైతుల్లో నెలకొంది. సత్యసాయి జిల్లాలో రబీ పూర్తిగా ఎత్తిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
అక్టోబర్‌లోనూ వర్షాభావమే
రబీ పంటల సాగుకు కీలకమైంది అక్టోబరు మాసం. ఈ మాసంలోనూ అటు అనంతపురం, ఇటు సత్యసాjయి జిల్లా రెండు చోట్లా తీవ్ర వర్షాభావ పరిస్థితులే నెలకొన్నాయి. అనంతపురం జిల్లాలో అక్టోబర్ మాసంలో సాధారణ వర్షపాతం 98 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 6.4 మిల్లీమీటర్ల మాత్రమే నమోదయ్యింది. సత్యసాయి జిల్లాలో 115.2 మిల్లీమీటర్లకుగానూ 2.2 మిల్లీమీటర్లు మాత్రమే నమోదయింది. జూన్ నుంచి ఇప్పటి వరకు చూస్తే అనంతపురం జిల్లాలో సాధారణ వర్షపాతం 417.7 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 253.8 మిల్లీమీటర్లు మాత్రమే నమోదయ్యింది. సాధారణం కంటే 39.2 శాతం తక్కువ వర్షపాతం ఈ ఏడాది నమోదయ్యింది. సత్యసాయి జిల్లాలో 471.7 మిల్లీమీటర్లు సాధారణ వర్షపాతానికిగనానూ 299.2 మిల్లీమీటర్లు మాత్రమే వర్షపాతం నమోదయ్యింది. 33.6 శాతం ఈ ఏడాది వర్షపాతలోటుంది. రెండు జిల్లాల పరిధిలోనూ అటు ఆరు మండలాలు, ఇటు ఆరు మండలాల్లో మినహా తక్కిన అన్ని మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఖరీఫ్ పంటలు ఇప్పటికే పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో ఈ ఏడాది రబీ ఆశలు కూడా సీజన్ ప్రారంభంలోనే ఆవిరయ్యే సూచనలు కనిపిస్తుండటం రైతులను దిక్కుతోచని స్థితిలోకి పడేస్తోంది.










