ప్రజాశక్తి-అనకాపల్లి
రబీ సీజన్లో రైతులు అపరాలు, నువ్వులు, మొక్కజొన్న, కూరగాయల వంటి పంటలపై ప్రత్యేక శ్రద్ధ వహించి లాభాలు పొందవచ్చని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పరిశోధన సహ సంచాలకులు డాక్టర్ పివికె.జగన్నాథరావు అన్నారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం జూబ్లీ హాల్‌లో శనివారం జరిగిన శిక్షణ సందర్శన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ ప్రతినిధి దాస్ మాట్లాడుతూ అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం 2023 సందర్భంగా జిల్లాలో చిరుధాన్యాల సాగును ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. వ్యవసాయంలో కూలీల కొరతను అధిగమించేందుకు, ఖర్చు తగ్గించేందుకు గ్రామస్థాయిలో కస్టమ్ హైరింగ్ సెంటర్లను ప్రారంభిస్తున్నామని చెప్పారు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లాలో జీడి, మామిడి, కూరగాయల సాగును ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కెవికె శాస్త్రవేత్తలు, ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ భవాని, ఆర్‌ఏఆర్‌ఎస్ చెరకు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి చిత్కలాదేవి, శాస్త్రవేత్తలు డాక్టర్ కెవి రమణమూర్తి, డాక్టర్ ఎం విశాలాక్షి, ఆదిలక్ష్మి, ఆర్ సరిత, చంద్రశేఖర్, సీతారామలక్ష్మి, కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ డి.ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.










