Jul 06,2023 00:51

స్వాధీనం చేసుకున్న బియ్యం వద్ద అధికారులు

ప్రజాశక్తి - చిలకలూరిపేట, గుంటూరు జిల్లాప్రతినిధి : రేషన్‌ డీలర్లు, ఎమ్‌డియు వాహనాల ఆపరేటర్లు రేషన్‌ పంపిణీలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈపోస్‌ మిషన్‌లో బయోమెట్రిక్‌ చేతి వెళ్లకు పోలిన రబ్బర్‌ను వినియోగించి అక్రమాలకు పాల్పడుతున్నట్టు విజిలెన్సు అధికారుల విచారణలో వెల్లడయింది. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం నుంచి తూబాడుకు అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ 170 బస్తాల రేషన్‌ బియ్యంను విజిలెన్సు అధికారులు బుధవారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. రెండు వేర్వేరు లారీల్లో ఒక్కొ వాహనంలో 85 బస్తాల చొప్పున తరలిస్తుండగా విజిలెన్సు అధికారులు పట్టుకున్నారు. డ్రైవర్లు యర్రా సుధీర్‌ కుమార్‌, గారపాటి వెంకటేశ్వరరావులను విచారించగా నూతక్కి నాగేశ్వరరావు అనే వ్యక్తి చెప్పిన విధంగా గణపవరం నుంచి తూబాడుకు రేషన్‌ తీసుకువెళ్తున్నట్టు విజిలెన్సు అధికారుల విచారణలో వెల్లడించారు. అనంతరం నాదెండ్ల, గణపవరంలో చౌకధరల దుకాణాలను తనిఖీ చేయగా గణపవరం లో ఉన్న 17వ నెంబరు చౌక ధరల దుకాణం రేషన్‌ బియ్యం నిర్దేశిత నిల్వ కంటే 8.85 క్వింటాళ్ల బియ్యం తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. సంబంధిత డీలర్‌పై కేసు నమోదుకు విజిలెన్సు అధికారులు ఆదేశాలు ఇచ్చారు. గణపవరంలో 41వ దుకాణంకు సంబంధించిన ఎండియు వాహనం ఆపరేటర్‌ పెంటల వీరయ్యకు తన వేలిముద్రలతో పోలిన ప్లాస్టిక్‌ రబ్బర్‌ థంబ్‌ను తయారు చేసి తన సహాయకుడు నెట్టిగల రాజశేఖర్‌కు ఇవ్వగా అతను 41వ నెంబరు దుకాణంలో డీలర్‌ గొడుకు వీరాంజనేయులుతో కలిసి మోసపూరిత విధానంలో స్టాక్‌ పంపిణీ చేస్తున్నట్టు గుర్తించారు. ఈ మేరకు డీలర్‌, ఆపరేటర్‌, రాజశేఖర్‌పై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని అధికారులు ఆదేశించారు. విజిలెన్సు ఎస్‌పి ఈశ్వరయ్య పర్యవేక్షణలో సిఐ శ్రీహరిరావు, తహశీల్దార్‌ కె.నాగమల్లేశ్వరరావు, ఎస్‌ఐ ఎం.రామచంద్రయ్య, ఎఫ్‌ఆర్వో షేక్‌ సైదులు, సీఎస్‌డీటీ టి.కొండారెడ్డి పాల్గొన్నారు.
ప్రజాశక్తి-ప్రత్తిపాడు : కార్డు దారుల నుంచి కీలో రేషన్‌ బియ్యం రూ.10-12కు కొనుగోలు చేసి అక్కడే ఒక ఇల్లు అద్దెకు తీసుకొని అందులో బద్ర పరచి అర్దరాత్రి సమాయంలో వాటిని తరలిస్తున్నారు. బుధవారం ప్రత్తిపాడు ఎస్‌ఐ రవీంద్రబాబుకు అందిన సమాచారం మేరకు మండలంలోని రావిపాటివారిపాలెంలోని ఎస్‌సి కాలనీలో కాకిరాల చిన్నమ్మాయి ఇంటిలో అక్రమముగా నిల్వ ఉంచిన 13 ప్లాస్టిక్‌ సంచుల్లోని 640 కిలోల బియ్యాన్ని స్వాధీనం చేసుకునానరు. కుంభా కల్యాణ్‌ అనే అతనిని అదుపులోకి తీసుకున్నారు. సదరు బియ్యం రవాణా కోసం వినియోగిస్తున్న ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.