Nov 14,2023 22:59

విలేకరులతో మాట్లాడుతున్న వైసిపి నాయకులు

ప్రజాశక్తి- వజ్రపుకొత్తూరు: తమ గ్రామస్తులను రౌడీలని, గుండాలని ముద్రవేస్తే సహించేది లేదని మంచినీళ్లపేట సర్పంచ్‌ వంక సత్యరాజు, వైస్‌ ఎంపిపి వంక రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచినీళ్లపేట సముద్రతీరంలో గ్రామస్తులతో కలసి వారు మంగళవారం విలేకరులతో మాట్లాడారు. రౌడీలు, గుండాలంటూ విషపు రాతలు రాయించినందుకే గౌతు శిరీషను తన గ్రామానికి రాకుండా అడ్డుకున్నామని తెలిపారు. సమాధానం చెప్పకుండా వెనుతిరిగిన శిరీష మళ్లీ అవే పదాలు ఉపయోగిస్తున్నారని అన్నారు. ఇలాగైతే గ్రామాల్లో తిరగనివ్వబోమని వారు హెచ్చరించారు. మంత్రి ప్రమేయంతో తాము అడ్డుకున్నామని దుష్ప్రచారం చేయడం నిందలు వేయడం సరికాదని హితవు పలికారు. మంత్రి ప్రమేయం ఉంటే ఆమెను ఊర్లోకి అడుగు పెట్టించే వాళ్లమే కాదన్నారు. గౌతు శిరీష గ్రామంలో గొడవలు పెట్టడానికే వస్తున్నారే తప్ప వేరే ఉద్దేశం ఆమెకు లేదని అన్నారు. ఆమె తమ గ్రామ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో తమ తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. టిడిపి నాయకులు మంచి కోరే వారైతే తమ గ్రామంలోని మాజీ సర్పంచ్‌ చిన్నారావు రూ.40 లక్షల గ్రామస్తులు సొమ్ము తన వద్ద అంటి పెట్టుకున్నారని, దానిని పంచాయతీకి అప్పజెప్పేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మత్స్యకారులకు గౌతు కుటుంబం ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. మంత్రి అప్పలరాజు మంచినీళ్లుపేట జెట్టిని ఫిషింగ్‌ హార్బర్‌గా అభివృద్ధి చేస్తున్నారని, మూలపేరు పోర్టును నిర్మిస్తున్నారని అన్నారు. టిడిపి హయాంలో నిర్మించిన తుపాను భవనాలు పశువులు కొట్టంగా పనిచేస్తుంది తప్ప ప్రజలకు ఉపయోగ లేకుండా చేశారని దుమ్మెత్తి పోశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ శంభురావు, బి.శంకర్‌, ఏసులు, చింతల దానేష్‌, సాంబమూర్తి, మోహనరావు పాల్గొన్నారు.