
ప్రజాశక్తి-నెల్లూరు :బిజెపి అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్ల ప్రజలు విసిగివేసారి ఉన్నారని, వారు బాగుపడాలంటే బిజెపిని ఇంటికి పంపించి తీరాలని ప్రజలు అను కుంటున్నారని సిపిఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు పేర్కొన్నారు. రాష్ట్రంలో అసమానత లేని అభివృద్ధి కావాలని కోరుతూ సిపిఎం ప్రజారక్షణ భేరీ పేరుతో అక్టోబరు 30వ తేది నుంచి బస్సు యాత్ర ప్రారంభించింది. ఈ బస్సు జాతా కర్నూల్, ఆదోని ప్రాంతాల నుంచి బయల్దేరి సోమవారం నెల్లూరు నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా విఆర్‌సి సెంటర్‌లో బహిరంగ సభ నిర్వహించారు. సభకు ముఖ్య అతిథిగా సిపిఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజా రక్షణ పేరుతో సిపిఎం బస్సు యాత్ర ప్రారంభించిన నాటి నుంచి రాష్ట్రరాజకీయాలు బలే రంజుగా తయారయ్యాయ న్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చి పదేళ్లు అయిందన్నారు. ఈ కాలంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రజా ధనం రూ. 3,500 కోట్లు ఖర్చు చేసి పటేల్ విగ్రహం ఏర్పాటు చేశార న్నారు. లీటరు పెట్రోల్ రూ.120లు చేశారని, రామాలయం నిర్మించారని, వందేభారత్ పేరుతో ఒక ట్రైన్ నడపడం తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. పుచ్చిపోయిన వంకాయలు కేజీ రూ.80లు, కందిపప్పు ధరలు చూస్తే ఆకాశాన్నంటుతున్నాయన్నారు. ఈ ప్రభుత్వాల పాలనలో సామాన్య మధ్యతరగతి ప్రజలు, కార్మికులు బతకలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో బిజెపి ఇంటికి పోవాలంటే ముందుగా తెలంగాణా కె.సి.ఆర్, ఎపిలోని వైసిపి ఇంటికి వెళ్లాలని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. వైసిపి బిజెపితోబ్రహ్మముడి వేసుకుందన్నారు. ఆ ప్రభుత్వం చెప్పిన ప్రతి ఒక్కటి చేస్తున్నారన్నారు. అందులో భాగంగా కేంద్రం వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసేందుకు నల్ల చట్టాలు తీసుకొస్తే వాటికి అనుకూలంగా ఓటేసిందన్నారు. విద్యుత్తు సంస్కరణలు అమలుకు సుముఖత వ్యక్తం చేశారన్నారు. కృష్ణపట్నం పోర్టును అదానికి అప్పగించాలని చెబితే చేశారన్నారు. ఇంత జరుగు తున్నా చంద్రబాబు నాయుడు బిజెపి అడ్డగోలుగా పరిపాలన చేస్తుందని ప్రకటించక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. మతోన్మాదం పోవాలి.. ప్రయి వేటీకరణ పోవాలన్నదే సిపిఎం నినాదం అన్నారు. రామా యపట్నం పోర్టు నిర్వాసితులకు నష్ట పరిహారం అందజేయ కపోతే ఆ నిర్మాణాలను సిపిఎం అడ్డుకొని తీరుతామన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లనే కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ప్రస్తుతం తెలంగాణాలో జరగనున్న ఎన్నికల్లో కెసిఆర్ ఒటమి పాలు కావడం తథ్యమని చెప్పారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ చేస్తున్న పోరాటం వెయ్యి రోజులకు చేరుకోబోతుందన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 8వ తేదీన విద్యాసంస్థలు బంద్ చేసి ప్రభుత్వానికి విద్యార్థులు సైతం నిరసన తెలియజేయ బోతున్నారన్నారు. కరువు ప్రాంతాలు ప్రకటించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైం దన్నారు. జిల్లాలోని ఉదయగిరి, సీతారాంపురం, లింగసముద్రం, సైదాపురం, దగదర్తి వంటి ప్రాంతాల్లో పంటలు పండక రైతులు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ సభకు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ఈ బస్సు యాత్రకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.ప్రభాకర్‌రెడ్డి నాయకత్వం వహించారు. సిపిఎం రాష్ట్ర నాయకులు కె.ఉమామహేశ్వరరావు, ఎం. భాస్కరయ్య, రమాదేవి, సిపిఎం జిల్లా సీనియర్ నాయకులు చండ్ర రాజగోపాల్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.మోహన్‌రావు, కె.అజరుకుమార్, మూలి వెంగయ్య, బత్తల కృష్ణయ్య, పలువురు నాయకులు పాల్గొన్నారు.