Nov 08,2022 23:57

రైవాడ రిజర్వాయర్‌లో చేపపిల్లలను వేస్తున్న డిప్యూటీ సిఎం బూడి, కలెక్టర్‌ తదితరులు

ప్రజాశక్తి- దేవరాపల్లి
మండలంలోని రైవాడ జలాశయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడతామని ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. జిల్లా కలెక్టర్‌ రవి పఠాన్‌శెట్టితో కలిసి మంగళవారం సాయంత్రం ఆయన జలాశయాన్ని సందర్శించారు. బిల్లలమెట్ట వద్ద ఉన్న రెగ్యులేటింగ్‌ గేట్లు ఎక్కి జలాశయం ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌ సహకారంతో అనకాపల్లి జిల్లాలోని కొండకర్ల ఆవ, రైవాడ జలాశయం ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా మార్చి ఆయా ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పారు. రైవాడ గ్రామానికి ఎత్తిపోతల పథకం కింద జలాశయం నీరు అందించేందుకు రూ.250 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు చెప్పారు. కలెక్టర్‌ రవి మాట్లాడుతూ జలాశయంలో మంగళవారం ఆరు లక్షల చేప పిల్లలను వేశామని, త్వరలో మరో నాలుగు లక్షల చేప పిల్లలు వేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. 8 నెలల పాటు చేప పిల్లల పెంపకం జరుగుతుందన్నారు. దీనివలన 400 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య శాఖ అధికారి పి.లక్ష్మణరావు, ఎంపీపీ కిలపర్తి రాజేశ్వరి భాస్కరరావు, వైస్‌ ఎంపీపీ గంగభవాని అప్పారావు, సర్పంచ్‌ చల్లా లక్ష్మి నాయుడు, తహసీల్దార్‌ ఎం.లక్ష్మి, ఎంపీడీవో జీవీ రమణ, ఎంఈఓ సిహెచ్‌ రవీంద్రబాబు, జలశయం ఏఈ సత్యం నాయుడు, వైసీపీ నాయకులు బూరె బాబురావు, డాక్టర్‌ వరదపురెడ్డి సింహాచలం నాయుడు, చల్లా తాతయ్యలు, ఎంపీటీసీ మొల్లి కృష్ణమూర్తి, వేచలపు అప్పలనాయుడు పాల్గొన్నారు.