Oct 21,2023 21:26

హర్షం వ్యక్తం చేస్తున్న ఎపి రైతుసంఘం, సిఐటియు నాయకులు

           ప్రజాశక్తి-పెద్దవడుగూరు   ఎపి రైతుసంఘం, సిఐటియు ఆధ్వర్యంలో మండల కేంద్రంలో శనివారం వాచాతి విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి ఆర్‌.చంద్రశేఖర్‌రెడ్డి, మండల కార్యదర్శి దస్తగిరి మాట్లాడుతూ తమిళనాడులో మదమెక్కిన అధికార యంత్రాంగానికి కోర్టు తీర్పు చెంప పెట్టు అన్నారు. తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లాలో అడవి లోతట్టున ఉన్న గ్రామం వాచాతిలో మహిళలపై జరిగిన దాడి ఘోరం అన్నారు. 1992 జూన్‌ 20న వాచాతి గ్రామం మీదకు దండెత్తిన అటవీ అధికారులు, వారికి మద్దతుగా రెవెన్యూ, పోలీస్‌ అధికారులు దాదాపు 18 మంది మహిళలు, బాలికలు అత్యాచారానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్మార్గునికి ఒడిగట్టిన 215 మంది ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులను నేరస్తులుగా నిర్ధారించి శిక్ష అనుభవించాలని మద్రాస్‌ హైకోర్టు ఆదేశించడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఆదినారాయణ, వెంకటరాముడు, ఆది, సులేమాన్‌, హసేన్‌, రంగప్ప, ఎరికలయ్య, చితంబర్‌రెడ్డి, ఆటారి, తదితరులు పాల్గొన్నారు.