ప్రజాశక్తి -గుంటూరు జిల్లాప్రతినిధి : ఉపరితల ధ్రోణి ప్రభావంతో గుంటూరు, పల్నాడు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు పల్నాడు జిల్లాలో కుండపోతగా వర్షం కురిసింది. కళ్లాల్లో వున్న జొన్న, మొక్కజొన్న, మిర్చి పంటలకు నష్టం వాటిల్లింది. గుంటూరు జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. కళ్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారు. మాచర్లలో అత్యధికంగా 100 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. వరి, జొన్న, మొక్కజొన్న, మిర్చిపంటలకు బాగా నష్టం జరిగింది. కోతకు సిద్ధంగా ఉన్న వరి, కోసి ఆరబోసిన మొక్కజొన్న, మిర్చి పంటలు తడిసిపోయాయి. వట్టిచెరుకూరులో భారీ వర్షం కురిసింది. పొలాల్లో ఆరబోసిన మిర్చి, మొక్కజొన్న దెబ్బతిన్నాయి. మిర్చి తడిసి రంగు మారుతోందని రైతులు వాపోతున్నారు.
పట్టాలు కప్పినా భారీ వర్షం కురిసి నీరు నిలిచి పట్టాలలోంచి మిరప, మొక్కజొన్న తడిసిపోయింది. పట్టాలు తీసే సమయంలో కూడావర్షం నీరు పంటపై పడి నాణ్యత దెబ్బతింటున్నారు. పొలాల్లో మొక్కజొన్న, మిర్చి, జొన్న పంటలను ఎండబెట్టుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. ప్రత్తిపాడు మండలంలో కల్లాలో ఆరబోసిన మిర్చి, మొక్కజొన్నపై రైతులు ముందస్తుగా పట్టాలు కప్పి ఉంచినా కొన్ని చోట్ల గాలులకు పట్టాలు ఎగిరిపోయి పంటలు తడిసిపోయాయి. మరికొన్ని చోట్ల పట్టాలపై నీరు చేరి అధికనష్టం జరిగింది. మాచర్లలో మామిడి, బొప్పాయి, అరటి పంటలు దెబ్బతిన్నాయి.
మిర్చి పంట చివరి కోతలకు సిద్ధంగా ఉన్న పల్నాడు ప్రాంతంలో భారీ వర్షాలకు నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు. అచ్చంపేట మండలంలో ఇసుక బట్టీలు నీట మునిగి కార్మికులకు పనులు లేకుండా పోయాయి. ముప్పాళ్ల మండలంలో సోమవారం తెల్లవారుజూమున భారీవర్షం కురిసింది. ఆరబోసిన మిర్చిని కాపాడుకునేందుకు రైతులు ఉరుకులు పరుగులు పెట్టారు. మిర్చి, మొక్కజొన్న పంటలకు కొంత తడిసి రైతులు నష్టపోయారు. మిర్చి రంగుమారి తెల్లకాయలుగా మారుతున్నాయి. మొక్కజొన్న పంట నిమ్ముకు రంగు మారి బుజ్జు పట్టే అవకాశం ఉందని రైతులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆది, సోమ వారాల్లో పల్నాడు, గుంటూరు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం వల్ల దాదాపు 12 మండలాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. మాచర్ల, పిడుగురాళ్ల, రెంటచింతల, ఈపూరు, క్రోసూరు, మాచవరం, ముప్పాళ్ల, అచ్చంపేట, దుగ్గిరాల, వట్టిచెరుకూరు, తాడికొండ, బెల్లంకొండ మండలాల్లో పంటలకు నష్టం జరిగి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మాచర్లలో భారీ వర్షం కురవడంతో రహదారులపై వర్షం నీరు ఏరులై పారింది. మరోవైపు వర్షాలతో వేసవి తీవ్రత తాత్కాలికంగా తగ్గింది. చల్లటి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది. మరో వైపు వర్షాలతో జగనన్న కాలనీల్లో ఇళ్లనిర్మాణం నిలిచిపోయింది. వేసవిలో వేగంగా ఇళ్లనిర్మాణం చేపట్టాలన్న అధికారుల లక్ష్యంకు కొన్ని మండలాల్లో ఇబ్బంది ఏర్పడింది.










