
వ్యవసాయ, ఆక్వారంగ రాష్ట్ర సదస్సు పిలుపు - సమస్యల పరిష్కారానికి రైతులు, కార్మికులు ఏకం కావాలి
ప్రజాశక్తి - భీమవరం, భీమవరం రూరల్
వ్యవసాయం, ఆక్వా రంగాలతోపాటు ఇతర అన్ని పంటల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, వీటి మీదే ప్రధానంగా ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతులు, అనుబంధ కార్మికులు అనేక ఇబ్బందుల మధ్య జీవనం సాగిస్తున్నారని, ఈ నేపథ్యంలో రైతుని నిలబెట్టుకుని.. వ్యవసాయాన్ని కాపాడాలి అని వ్యవసాయ, ఆక్వారంగ సమస్యలు, ప్రభుత్వాల విధానాలు-పరిష్కారానికి ప్రత్యామ్నాయాలు'పై రాష్ట్ర రైతు సదస్సు పిలుపునిచ్చింది. వ్యవసాయం, ఆక్వాతోపాటు ఇతర పంటలను కాపాడి రైతులను ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసింది. సమస్యలు పరిష్కరించకపోతే రైతులు, కార్మికులు ఒకే తాటిపైకి వచ్చి పాలకులకు గుణపాఠం చెబుతామని సదస్సు స్పష్టం చేసింది. స్థానిక రైస్‌మిల్లర్స్ హాలులో సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం రైతు రాష్ట్ర సదస్సు నిర్వహించారు. సదస్సుకు సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం అధ్యక్షత వహించారు. ముఖ్యవక్తలుగా ప్రముఖ రైతు నాయకులు వై.కేశవరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం విచ్చేశారు. సదస్సులో తీర్మానాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చింతకాయల బాబూరావు ప్రవేశపెట్టారు. వ్యవసాయ, ఆక్వా రైతులతోపాటు కాయగూరలు, తమలపాకు, ఉప్పు, పండ్లు రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రాష్ట్ర సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. భవిష్యత్తులో ఈ డిమాండ్ల పరిష్కారానికి ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని సదస్సు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ముఖ్యవక్త కేశవరావు మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగించేలా వ్యవహరిస్తుందని విమర్శించారు. దీనికి నిదర్శనం గతంలో తీసుకొచ్చిన మూడు నల్ల చట్టాలన్నారు. అప్పట్లో రైతులు ఢిల్లీలో ప్రాణాలకు తెగించి పోరాడారని, అయితే మోడీ దిగొచ్చి చట్టాలను రద్దు చేసినప్పటికీ అప్పట్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని విమర్శించారు. కృష్ణా, గోదావరి జిల్లాల్లో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో పంటలు పండే పరిస్థితి లేద న్నారు. దీనికి ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలే కారణమన్నారు. రైతు లు వేలాది కోట్ల రూపాయలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయడంతోపాటు ప్రొసెసింగ్, మార్కెటింగ్, అమ్మకం వెసులుబాటు కల్పించినప్పుడే వ్యవసాయం, ఆక్వారంగాలు అభివృద్ధి సాధిస్తాయన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.వాసుదేవరావు, రైతులు ప్రజలు పాల్గొన్నారు.