చలి పులిలా కాటేస్తోంది
జివ్వుమని లాగుతున్న నీటిలో
పంటంతా మట్టి పాలౌతుంటే.
కన్నీళ్ళ వెచ్చదనం
ఎదపై రాలుతుంటే..
గుప్పెడు వరిదుబ్బులను లేపి
గాయపడ్డ
చంటి పిల్లని చూస్తున్నట్లే
ఒకటే వేదన
ఆకలి వేయక
తడారతున్న గొంతును
పొడి పొడి గుటకలేస్తూ
తడుముకుంటూ ....
తడుపుకుంటున్న రైతు భుజంపై
భరోసా చేయి వేయాల్సిన పాలకులంతా
ఫోటోల సందడి చేసి వెళ్ళిపోయాకా
ఒంటరి రైతు
ఆకాశం వేపు చూస్తూ
దేశాన్ని వెదుకుతున్నాడు.
దేశాన్ని వెదకడంలో
అంతకు మించి స్వార్ధపరుడు మరొకడుండడన్నట్లే.
కనీసం ఓదార్చలేని మనుషులు
మనసుకు మంగళం పాడేసి
తిరుగు పయనంలో
చిరునవ్వుని నిట్టూర్పులా
వదిలేసి వెళ్ళడం మామూలే.
గుప్పెడు వదిలిన రైతు చేతిని
నాలుగు వడ్లగింజలు
కరుచుకుని పడుకున్నై
'నాన్నా' అన్నట్లు శబ్దం
గాలి మోసుకుని వెళ్ళిపోయిందప్పుడే.
అప్పుడక్కడ
రెండు సముద్రాలు వేడెక్కినై
ఒకటి చేనును ముంచినట్లూ
మరోటి రైతు మనసుని ముంచుతున్నట్లూ...!
ఇది శాపమా!
దేశ అరిష్టానికి శకునమా!!
రైతు చేనుని తప్ప
ఆ చుట్టూ...
చలిపులిలా కాటేస్తోంది.
- కొత్తపల్లిమణీ త్రినాథరాజు
9949389296