Nov 06,2023 00:25

జిడిసిసి బ్యాంకు చైర్మన్‌ రాతంశెట్టి సీతారామాంజనేయులు

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి :  ఉమ్మడి గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ప్రస్తుతం రూ.30 కోట్ల లాభాల్లోకి వచ్చిందని బ్యాంకు చైర్మన్‌ రాతంశెట్టి సీతారామాంజనేయులు (రాము) తెలిపారు. గతంలో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని నష్టాల్లో ఉన్న బ్యాంకు గణనీయంగా పురోగతి సాధిం చిందని చెప్పారు. వివిధ తరగ తుల వారికి రుణాలు ఇస్తు న్నామని, వ్యాపార లావాదేవీలు బాగా పెరిగాయన్న ఆయన ప్రజాశక్తికి ఇచ్చిన ఇంటర్య్వూలో పలు అంశాలు తెలిపారు.
బ్యాంకు పురోగతి ఎలా ఉంది?
టిడిపి హయాంలో బ్యాంకు నష్టాల్లో ఉంది. 2019లో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత క్రమంగా బ్యాంకు అభివృద్ధి దిశలో పయనించింది. 2019లో రూ.7 కోట్ల లాభాలతో ప్రారంభమైన బ్యాంకు ప్రస్తుతం రూ.30.13 కోట్ల లాభాల్లోకి చేరింది. 2019లో షేర్‌ క్యాపిటల్‌ కేవలం రూ.114.16 కోట్ల వరకు ఉండగా 2023 అక్టోబరు 31 నాటికి రూ.286.66 కోట్లకు చేరింది. డిపాజిట్లు రూ.861 కోట్ల నుంచి రూ.1332.40 కోట్లకు, వివిధ తరగతులకు రుణాలు రూ.866.59 కోట్ల నుంచి రూ.3258.97 కోట్లకు పెరిగాయి. 2019లో వ్యాపార లావాదేవీలు రూ.2530.66 కోట్లు జరిగాయి. 2019 నుంచి ఇప్పటి వరకు రూ.6048.86 కోట్లకు పెరిగాయి. రాష్ట్రంలో 13 డిసిసిబిల్లో బాగా పురోగతి సాధించిన బ్యాంకుల్లో గుంటూరు జిల్లా రెండో స్థానంలో ఉంది.
ఉమ్మడి జిల్లాలో ఎన్ని పిఎసిఎస్‌లు ఉన్నాయి? రుణాలు పంపిణీ?
167 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పిఎసిఎస్‌), 42 డిసిసిబి బ్రాంచిలు ఉన్నాయి. వీటిల్లో 9,95,533 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 2,03,151 మందికి రుణాలిచ్చాం. 4,58,915 మంది డిపాజిటర్లు ఉన్నారు. కొత్తగా రైతుల పిల్లలకు విదేశీ చదువులకు కూడా రుణాలిస్తున్నాం. పంట రుణాలు, దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలు, ట్రాక్టర్లు కొనుగోలు, గొర్రెలు, మేకలు పెంపకం దారుల, కోళ్లఫారాలకు, చేపల పెంపకం, భూమి అభివృద్ధికి, చిరు వ్యాపారులకు, స్వయం సహాయక సంఘాలు, విద్యార్థులకు రుణాలు ఇస్తున్నాం. బ్యాంకు పనితీరుపై నమ్మకరతో ప్రజలు రూ.1332.40 కోట్ల వరకు డిపాజిట్లు ఉంచారు.
విద్యారుణాలు ఎలా ఇస్తారు?
రైతుల పిల్లలకు విద్యారుణాలు ఇచ్చేందుకు ప్రాధాన్యమిస్తున్నాం. గరిష్టంగా రూ.40 లక్షల వరకు రుణాలిస్తాం. ఇప్పటి వరకు 380 మంది విద్యార్థులకు రూ.81.30 కోట్ల రుణాలు ఇచ్చాం. 662 మంది రైతుల పిల్లలకు విదేశీ విద్యారుణాలు అందించాం. శావల్యాపురం, నరుకుళ్లపాడులో కోల్డ్‌ స్టోరేజీల నిర్మాణానికి రుణాలిస్తున్నాం. బంగారంపై రుణాలు గతనాలుగేళ్లలో గణనీయంగా పెంచాం. రూ.49.45 కోట్లనుంచి రూ.282.97 కోట్ల వరకు బంగారంపై రుణాలుఇచ్చాం.
బ్యాంకు లావాదేవీలు ఎలా పెరిగాయి?
అన్ని బ్యాంకులు కంప్యూటరీకరణ చేస్తున్నాం. సహకార బ్రాంచీల పరిధిలో 39 ఎటిఎంలు ఏర్పాటు చేశాం. 167 పిఎసిఎస్‌లలో మైక్రో ఎటిఎం సౌకర్యం కల్పి స్తున్నాం. పారదర్శకమైన సేవలను పెంచడం ద్వారా రైతులు, ఇతర వర్గాలకు చెందిన ప్రజల ఆదరణ పెరుగుతోంది. ఎక్కడా అక్రమాలు లేకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నాం. రైతుల నుంచి ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే విచారణ జరిపి బాధ్యులైన ఉద్యో గులు, అధికార్లపై చర్యలు తీసుకుంటున్నాం.