ప్రజాశక్తి - పాచిపెంట : సాంప్రదాయ వరి సాగు పద్ధతులను శాస్త్రీయ పద్ధతులతో మిలితం చేసి రైతులు వరి సాగు చేపట్టడం ద్వారా దిగుబడులు పెంచుకొని ఖర్చును తగ్గించుకోవచ్చని మండల వ్యవసాయ అధికారి కె.తిరుపతిరావు అన్నారు. మండలంలోని పాంచాలిలో రైతు బుడుమూరి వెంకన్నకు గ్రామీణ విత్తన ఉత్పత్తి పథకంలో భాగంగా ఇచ్చిన ఎంటియు 1064 రకాన్ని వరుసల్లో నాట్లు వేయించారు. ముందుగా ప్రధాన పొలంలో వేసిన కట్టె జనుము, జీలుగు, పచ్చిరొట్ట విత్తనాలను కలియదున్ని కొద్దిగా సింగిల్ సూపర్ ఫాస్పేట్ చల్లుకుంటే పచ్చిరొట్ట త్వరగా కుళ్లి భూమిలో సేంద్రీయ పదార్థం పెంచుతుందని తెలిపారు. అనంతరం నారును శుద్ధి చేసుకుని ఆపై కొసలు తుంచి వరుసల్లో నాటుకోవాలని తెలిపారు. నారుశుద్ధి వల్ల ప్రధాన పొలంలో నెలరోజుల వరకు తెగుళ్లు ఆశించకుండా ఉంటాయని, కొసలు తుంచి నాటుకోవడం వల్ల కాండం తొలుచు పురుగును గుడ్డు దశ నుండే నివారించుకోవచ్చని తెలిపారు. వరుసల్లో నాట్లు వేయడం ద్వారా గాలి, వెలుతురు అన్ని వైపులా ధారాళంగా ప్రవహించడం వల్ల దోమపోటు ఉధృతి తక్కువగా ఉండడమే కాకుండా చీడపీడలను సులభంగా గుర్తించవచ్చని తెలిపారు. అంతర్ కృషి ఎరువులు వేసుకోవడం వంటివి సులభంగా చేయవచ్చని తెలిపారు. అలాగే వరి నాట్లు వేసేటప్పుడు బురద పదునులో ఒకటి లేదా రెండు మొనలను మాత్రమే వేస్తూ బురద దమ్ములో తేలికపాటి నాట్లు వేసుకోవాలని నాట్లు లోతుగా వేస్తే మొన తిరగడం ఆలస్యం అవ్వడమే కాకుండా పిలకలు పెట్టే సమయం కూడా ఆలస్యమవుతుందని తద్వారా పిలకల సంఖ్య తగ్గిపోతుంది తెలిపారు. నాట్లు వేసిన మూడు రోజుల తర్వాత నీళ్లు పెట్టుకోవాలని, దమ్ములో ఎకరానికి బస్తా డిఎపి, 15 కిలోల యూరియా, 15 కిలోల పొటాష్ వేసుకోవాలని సూచించారు గట్లను శుభ్రం చేసుకోవడం ద్వారా గట్లపై ఉండే పాము పొడ తెగులు పంటను ఆశించకుండా ఉంటుందని, అలాగే ఎకరానికి 10 పక్షి స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా పక్షుల ద్వారా పురుగులను నియంత్రించ వచ్చని తెలిపారు. దీనివల్ల ఆకు చుట్టు పురుగును సమర్ధవంతంగా అరికట్టవచ్చని తెలిపారు. కార్యక్రమంలో విఎఎ ఈదివిల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.










