రైతులు, కూలీలు వలస బాట
- ప్యాపిలి మండలం నుంచి గుంటూరుకు..
- వర్షాలు లేక పూర్తిగా ఎండిపోయిన పంటలు
- ఉపాధి పనుల కల్పనలో పాలకులు విఫలం
ప్రజాశక్తి - ప్యాపిలి
వాన జాడ లేక కళ్ళముందే పంటలు ఎండి పోయాయి. రైతులు అప్పు చేసి పెట్టిన పెట్టుబడి మట్టి పాలయింది. ప్యాపిలి మండలంలోని అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి. రైతుల రెక్కల కష్టం వృధాగా మారింది. అప్పులు మిగిలాయి. ఉన్న ఊళ్ళల్లో పనులు లేవు. తినడానికి తిండి కరువై రైతులు, వ్యవసాయ కూలీలు వలస బాట పడుతున్నారు. వృద్ధులను, పసి పిల్లలను ఇంటి వద్ద వదిలి వలస బాట పయమవుతున్నారు.
ప్యాపిలి మండలంలోని ఆయా గ్రామాల నుంచి ప్రతి రోజు సుమారు 500 మంది చిన్న, సన్న రైతులు, వ్యవసాయ కూలీలు గుంటూరు, బెంగళూరు తదితర పట్టణాలకు వలస వెళ్తున్నారు. కలచట్ల, రంగాపురం, శబాష్‌పురం చుట్టుపక్కల గ్రామాల నుండి దాదాపు 200 మంది వలస వెళ్లారు. ప్యాపిలి పట్టణం నుండి కూడా వలస వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వలసల నివారణకు అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రకటనలకే పరిమితమవుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ సాయం కనుచూపు మేరలో కూడా కనిపించక పోవడంతో గ్రామీణ ప్రాంత వ్యవసాయ కూలీలు, చిన్న సన్న కారు రైతులు ఇప్పటికే దాదాపు వెయ్యి మంది వసల వెళ్లారు. ఈ నెల 19న హద్రీనీవా ద్వారా చెరువులకు నీటి మళ్లింపు కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విచ్చేసిన సందర్భంగా డోన్ బహిరంగ సభలో ప్యాపిలి, డోన్ మండలాల్లోని చెరువులను హంద్రీనీవా నీటితో నింపి సస్యాశ్యామలం చేస్తామని ఎంతో ఆర్భాటంగా ప్రకటించారు. వాస్తవంగా డోన్ మండలంలోని జగదుర్తి, యాపదిన్నె చెరువులను మాత్రమే హంద్రీనీవా నీటితో నింపారు. ప్యాపిలి మండలంలో ఒక్క చెరువును కుడా నింపలేదు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి వారానికొకసారి ప్యాపిలి మండంలో పర్యటిస్తున్నా ఎండిన పంటలను పరిశీలించడం లేదు. చిన్న, సన్న కారు రైతులు, కూలీలు వలసలు వెళ్తున్నా వారికి ఉపాధి చూపకపోవడం శోచనీయం. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితాలో ప్యాపిలి మండలం లేకపోవడం శోచనీయం. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, సబంధిత అధికారులు స్పందించి గ్రామాల్లో ఉపాధి పనులు కల్పించి వలసలను ఆపాలని కూలీలు, చిన్న సన్నకారు రైతులు కోరుతున్నారు.
ప్యాపిలిని కరువు మండలంగా ప్రకటించి ఆదుకోవాలి
ప్యాపిలిని కరువు మండలంగా ప్రకటించాలి. కరువు నివారణ చర్యలు చేపట్టాలి. ఖరీఫ్‌లో రైతులు ఎకరాకు 30 వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టి వేరుశశగ, కందులు, అముదాలు, పత్తి, టమోటా తదితర పంటలు సాగు చేశారు. సరైన సమయంలో వర్షాలు పడక పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రకృతి వైపరీత్యాలకు పంటలు పండక నష్ట పోయిన రైతులను తక్షణమే ఆదుకుని, చిన్న, సన్న కారు రైతులు, వ్యవసాయ కూలీలను వలసలు పోకుండా నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
- కోయలకొండ నాగరాజు, సిపిఎం జిల్లా నాయకులు.
పాలకుల నిర్లక్ష్యమే డోన్ నియోజకవర్గానికి శాపం
అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్లు పరిశ్రమల ఏర్పాటుకు అవసరమయ్యే ఖనిజ సంపద డోన్ నియోజకవర్గంలో పుష్కలంగా ఉన్నా పాలకుల నిర్లక్ష్యమే నియోజకవర్గానికి శాపంగా మారింది. నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు లేక బతుకు తెరువు కోసం గ్రామీణ ప్రాంతాల నుండి కూలీలు హైదరాబాద్, బెంగళూరు, గుంటూరు ప్రాంతాలకు వలసలు పోతున్నారు. గతంలో ముఖ్యమంత్రిలు, క్యాబినెట్ మంత్రులు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించినా పరిశ్రమల ఏర్పాటుపై, ఉపాధి అవకాశాల కల్పనపై దృష్టి సారించలేదు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక మంత్రిగా డోన్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అయినా పరిశ్రమల స్థాపనకు కృషి చేసి ఉపాధి అవకాశాలు కల్పించి వలసలు నివారించాలి.
- టి.శివరాం, సిఐటియు జిల్లా కార్యదర్శి.
ప్యాపిలి మండలం నుంచి గుంటూరుకు వలస వెళ్తున్న వ్యవసాయ కూలీలు