Jul 03,2023 01:00

మాట్లాడుతున్న ప్రొఫెసర్‌ ఎన్‌.వేణుగోపాలరావు

ప్రజాశక్తి - యడ్లపాడు : దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి వెన్నుదన్నుగా ఉన్న రైతులు, కౌలురైతులు, కూలీల ప్రయోజనాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దెబ్బకొడుతున్నాయని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పేలా విధానాలను అమలు చేస్తున్నారని, వీటిని తిప్పికొట్టేందుకు సాగుతున్న ఉద్యమాల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 'వ్యవసాయ రంగం కార్పొరేటీకరణ - ప్రతిఘటనలో వ్యవసాయ కార్మికుల పాత్ర' అంశంపై సదస్సు మండల కేంద్రమైన యడ్లపాడులోని తహశీల్దార్‌ కార్యాలయం వద్ద శనివారం రాత్రి జరిగింది. సదస్సుకు వ్యవసాయ కార్మిక సంఘం పల్నాడు జిల్లా అద్యక్షులు కె.రోశయ్య అధ్యక్ష వహించగా ముఖ్యఅతిథిగా సుబ్బారావు మాట్లాడారు. రైతులు, కూలీలు పరస్పరం సహకరించుకుంటూ కృషి చేస్తేనే మనుగడ సాధ్యమన్నారు. వ్యవసాయ రంగంలో కార్పొరేట్‌ పెట్టుబడిదారులు ప్రవేశించి యాంత్రీకరణ చేస్తున్నారని, రైతుల స్థానంలో కార్పొరేట్లు, కూలీల స్థానంలో యంత్రాలు రావడం ద్వారా ఇక్కడి ప్రజల ఉపాధి దెబ్బతినడంతోపాటు దేశీయ ఆహార అవసరాలూ ప్రమాదంలో పడ్డాయని వివరించారు. దేశ అవసరాల కోసం ఆహార పంటలను కాకుండా విదేశాల్లో అవసరమైన పంటలను కార్పొరేట్లు పండించి వ్యాపారం చేసుకుంటారని అన్నారు. దేశంలో 80 కోట్ల మంది ఆధారపడ్డ వ్యవసాయ రంగంపై విదేశీ, కార్పొరేట్ల పెత్తనం మొత్తం దేశానికే నష్టమని ఆందోళన వెలిబుచ్చారు. ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఇలాంటి వినాశనకర విధానాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాల్లో రైతులతోపాటు కూలీలూ ముందువరసలో ఉండాలని అన్నారు. రైతు రక్షణ వేదిక అధ్యక్షులు, విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త ఎన్‌.వేణుగోపాలరావు మాట్లాడుతూ వ్యవసాయంలో కూలీల ప్రాధాన్యాన్ని పుచ్చలపల్లి సుందరయ్య ఏనాడో గుర్తించారని, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడ్డానికి సంఘాన్నీ నిర్మించారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం గతంలో తెచ్చిన మూడు నల్ల చట్టాల వల్ల వ్యవసాయం మొత్తం బహుళజాతి కంపెనీల చేతుల్లోకి పోతుందని, అందుకే ఆ చట్టాలను రైతులు తిప్పికొట్టారని అన్నారు. వ్యవసాయంపై వామపక్షాలు మినహా మిగతా ప్రతిపక్షాలూ పట్టించుకోవడం లేదన్నారు. కౌలురైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాధాకృష్ణ మాట్లాడుతూ వ్యవసాయం దండగ అనే ఆలోచనల్లో వ్యవసాయదార్లు ఉన్నారని, రైతులు, కౌలురైతులు, కూలీలు కలిసి ఉద్యమాల్లోకి రావడం ద్వారా పరిస్థితిల్లో మార్పులను సాధించుకోవాలని చెప్పారు. పల్నాడు జిల్లాలో వేలాది ఎకరాలు భూములు సాగుకు నోచక పడావుగా పడి ఉన్నాని, కౌలురైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా వీటిని నివారించడానికి, ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వాలు చర్యలేమీ తీసుకోవడం లేదని విమర్శించారు. కౌల్దార్లకు గుర్తింపు కార్డుల జారీ తూతూమంత్రంగానే ఉందని, వారికి అందుతున్న సహకారం ఏమీ లేదని చెప్పారు. అప్పులు చేసి పంటలు పండిస్తున్నారని తెలిపారు. వ్యవసాయ పరిరక్షణ కోసం రైతులు, కూలీలు ఐక్యంగా పోరాడాలన్నారు. సదస్సులో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.శివనాగరాణి, పల్నాడు జిల్లా కార్యదర్శి ఎ.లకీëశ్వరరెడ్డి, రైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాలరావు, నాయకులు టి.కోటేశ్వరరావు, ఆంజనేయులు పాల్గొన్నారు.