May 18,2023 20:06

ఆర్థికసాయం అందిస్తున్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి

ప్రజాశక్తి - మంత్రాలయం
రైతులు ఎవరూ అధైర్య పడి ఆత్మహత్యలు చేసుకోవద్దని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి సూచించారు. గురువారం ఎమ్మెల్యే స్వగ్రామమైన రాంపురంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి ప్రభుత్వం నుంచి అందిన ఆర్థిక సహాయాన్నిమృతుని భార్య లక్ష్మికి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అందజేశారు. నియోజకవర్గంలోని కౌతాళం మండలం మేళిగనూరు గ్రామంలో రైతు ఆత్మహత్య చేసుకున్నారు. రైతు భరోసా పథకంలో భాగంగా ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబాన్నీ ఆర్థికంగా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి బాధిత కుటుంబానికి రూ.7 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. దేవరమనే జగదీష్‌ భార్య లక్ష్మీకి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా జగదీష్‌ భార్య లక్ష్మి మాట్లాడుతూ... తన భర్త ఆత్మహత్య చేసుకోవడంతో తాను, తన ముగ్గురు కుమారులు దిక్కు తోచని స్థితిలో ఉన్నామని, ఎమ్మెల్యే తమకు మాట ఇచ్చారని తెలిపారు. ఇచ్చిన ప్రకారం తమకు రూ.7 లక్షల ఆర్థిక సహాయం అందించారని చెప్పారు. ఎమ్మెల్యేకు శాలువా, పూలమాల వేసి కృతజ్ఞతలు తెలిపారు. వైసిపి నదిచాగి గ్రామ నాయకులు రామన్నగౌడ, ఎంపిటిసి లింగన్న గౌడ, ఉప సర్పంచి నాగేశ, కాంతయ్య పాల్గొన్నారు.