ధాన్యం పరిశీలనలో మంత్రి, ప్రత్యేకాధికారి, కలెక్టర్, అధికారుల హామీ
ప్రజాశక్తి - కాజులూరు
రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేయడం జరుగుతుందని రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ రైతులకు హామీ ఇచ్చారు. శనివారం మంత్రి వేణుగోపాలకృష్ణ ,కాకినాడ జిల్లా ప్రత్యేక అధికారి ప్రద్యుమ్న పీఎస్, కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలాక్కియా, జిల్లా అధికారులతో కలిసి కాజూలూరు మండలం, జగన్నాథగిరి గ్రామంలో పర్యటించారు. మండలంలో రబీ వరి కోతలు, ఆర్‌బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు, ఆరబెట్టే దశలో ఉన్న ధాన్యం తదితర అంశాలను అధికారులు వివరించారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రైతుల వద్ద ఉన్న ధాన్యం మొత్తాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. కరప జిల్లా ప్రత్యేక అధికారి ప్రద్యుమ్న పీఎస్ కరప మండలంలో శనివారం జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి పర్యటించారు. పేపకాయలపాలెం, కూరాడ గ్రామాల్లో పంటను పరిశీలించారు. పిఠాపురం మండలంలోని ఎఫ్.కె పాలెం, జల్లూరులో జిల్లా కలెక్టర్ కృతికా శనివారం వ్యవసాయ, రెవెన్యూ, పౌరసరఫరాలు శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఆమె వెంట ఆర్‌డిఒ సీతారామరావు, కూడా వీసీ కె.సుబ్బారావు, తహశీల్దార్, వ్యవసాయ అధికారులుఉన్నారు. సామర్లకోట రూరల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం మండలంలోని వికెరాయపురం గ్రామంలో డ్వామా పీడీ అడపా వెంకటలక్ష్మి, ఇరిగేషన్ ఎస్.ఇ, ఎపీడీ వసంత మాధవి, ఎంపిడిఒ డి శ్రీలలిత, మండల తహశీల్దార్ లక్ష్మీనరసకుమారి, వ్యవసాయధికారుల బృందం పర్యటించి వీకే రాయపురంలోని కాజ్‌వే, తోటేరు డ్రెన్‌ౖ క్లీనింగ్, పంట పొలాలను, ధాన్యం రాశులను వారు పరిశీలించారు. కలెక్టర్ ఆదేశాను సారం వేట్లపాలెం వద్ద ఇరిగేషన్ శాఖ సర్ప్లస్ వైర్లను మూసివేశారు. దాని కారణంగా పొలాలలో నీటిమట్టం తగ్గిందని మరో 15 రోజులు వేట్లపాలెం ఇరిగేషన్ సర్‌ప్లస్ వైర్లను మూసి ఉంచినట్లయితే తమ పంటను కోసి ధాన్యాన్ని ఆర్బికేలకు పంపించుకుంటామని రైతులు కోరారు.
సమన్వయంతో ధాన్యం కొనుగోలు
- అధికారులకు జిల్లా ప్రత్యేక అధికారి పీఎస్ ప్రద్యుమ్న ఆదేశాలు
ప్రజాశక్తి - కాకినాడ
రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రవేశపెట్టిన రైతు భరోసా కేంద్రాల ద్వారా మద్దతు ధరకు ధాన్యం సేకరణ విధానాన్ని సజావుగా అమలు చేసేందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కాకినాడ జిల్లా ప్రత్యేక అధికారి ప్రద్యుమ్న పిఎస్ అధికారులను ఆదేశించారు. జగనన్నకు చెబుదాం, ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు నియమించిన ప్రత్యేక అధికారి ప్రద్యుమ్న పీఎస్, కలెక్టర్ కృతికా శుక్లా, జెసి ఎస్.ఇలాక్కియాతో శనివారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. రబీ సీజన్‌లో కాకినాడ జిల్లాలో మొత్తం 65,352 హెక్టార్లలో వరి సాగు చేయగా ఇప్పటివరకు 30,491 హెక్టార్లలో కోతలు జరిగినట్లు అధికారులు తెలిపారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇప్పటికే 14వేల మెట్రిక్ టన్నులకు పైగా కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ప్రత్యేక అధికారి ప్రద్యుమ్న మాట్లాడుతూ .రైతులకు అర్హత మేరకు ఇన్‌పుట్ సబ్సిడీ, పంట బీమా అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవ సాయ శాఖ జెడి ఎన్.విజరుకుమార్, పౌర సరఫరాల డీఎం డి.పుష్పమణి పాల్గొన్నారు.
రైతులకు పంటల బీమా పరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీ
రబీ సీజనులో అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టాలకు పంటల భీమా పరిహారం, ఇన్ పుట్ సబ్సీడీ అందజేయడం జరుగుతుందని, ఈ నెల 9 వ తేదీ తరువాత పంట నష్టాల ఎన్యూమరేషన్ ప్రక్రియ నిర్వహించి ఆర్హులైన రైతులందరికీ ఈ సహాయాల కొరకు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా శనివారం ఒక ప్రకటన జారీ చేశారు. జిల్లాలో ఈకెవైసి ఉన్నా లేకపో యినా క్రాప్ బుకింగ్ ఉన్న రైతులందరి నుండి ధాన్యం కొనుగోలు చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ నెల 7 నుండి 9వ తేదీ ల మధ్య రాష్ట్ర తీరం వెంట తుఫాన్ పరిస్థితుల దష్ట్యా రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ నెల 9వ తేదీన తుఫాను ప్రభావం ముగిసిన వెంటనే పంట నష్టాల ఎన్యూమరేషన్ ప్రక్రియను చేపడతామన్నారు.
జిల్లా ప్రత్యేక అధికారి ప్రద్యుమ్న తో మాట్లాడుతున్న మంత్రి వేణుగోపాకృష్ణ










