ప్రజాశక్తి -భోగాపురం : విమానాశ్రయం అప్రోచ్ రోడ్డు భూ సేకరణకు సంబంధించి రెండో రోజు కూడా బైరెడ్డి పాలెం వద్ద ఉద్రిక్తత నెలకుంది. రైతులు అడ్డుపడినప్పటికీ భూముల్లోని చెట్లను తొలగించారు ఆర్‌డిఒ సూర్యకళ ఆధ్వర్యంలో శనివారం చెట్లు తొలగించేందుకు అధికారులు సిద్ధమవ్వగా రైతులు అడ్డుపడ్డారు. దీంతో భోగాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బివి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పోలీసులు రైతుల మధ్య కొంత పెనుగులాట జరిగింది. అంతేకాక జెసిబికి అడ్డంగా రైతులు బైఠాయించారు. తమ భూములు తీసుకోవద్దంటూ కొంతమంది వృద్ధులు అధికారుల ముందు కన్నీరు మున్నీరుగా విలపించారు. తమ ఖాతాలో నష్టపరిహారం వేయకుండా భూములు పైకి ఎలా వస్తారని అధికారులను రైతులు నిలదీశారు. దీంతో ఆర్‌డిఒ వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. ఇప్పటికే విశాఖలోని ట్రిబ్యునల్ కోర్టులో ఎకరాకు రూ.52 లక్షలు చొప్పున పరిహారాన్ని జమ చేశామని వివరించారు. ఆ పరిహారం మీ అందరికి వచ్చేలా తాము బాధ్యత తీసుంటామని తెలిపారు. పనులకు అడ్డు పడవద్దని రైతులను కోరారు. రూ.52 లక్షలు పరిహారం మాకు సరిపోదని రైతులు అన్నారు. అంతేకాక గతంలో తమకు ఎకరానికి రూ.84 లక్షలు చొప్పున ఇస్తామని చెప్పి ఇప్పుడు తగ్గిస్తే ఎలాగని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చేది 52 లక్షలే తప్ప అదనపు పరిహారంతో మాకు సంబంధం లేదని ఆర్‌డిఒ తేల్చి చెప్పారు. తన ఇల్లు పోయినప్పటికీ ఎటువంటి పరిహారం అందలేదని ఒక రైతు చెప్పడంతో పరిహారంతో పాటు ప్యాకేజీ కూడా ఇప్పిస్తానని ఆర్‌డిఒ అన్నారు. ఆర్‌డిఒ సర్ది చెప్పడంతో రైతులంతా పక్కకు తప్పుకున్నారు. దీంతో భూముల్లోని చెట్లను జెసిబిలతో అధికారులు తొలగించారు. బైరెడ్డి పాలెంలో పూర్తయిన వెంటనే అధికారులు మధ్యాహ్నం నుంచి గూడెపువలస రెవెన్యూ పరిధిలోని అప్రోచ్ రోడ్డు భూముల్లో చెట్లు తొలగించారు. ఆదివారం ఎ.రావివలస భూముల్లోని చెట్లను తొలగించేందుకు సిద్ధమవుతున్నారు. ఇది పూర్తయితే అప్రోచ్ రోడ్‌కు సంబంధించిన 39 ఎకరాల భూ సేకరణ పూర్తవుతుంది. డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాసరావు, ఎస్‌ఐలు మహేష్ బాలకృష్ణ, సర్వేయరు, ఆర్‌ఐ మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

సొమ్మసిల్లి పడిపోయిన ఇద్దరు మహిళలు
అధికారులు జెసిబిలతో రావడంతో రైతులు అడ్డుపడడంతో పోలీసుల వారిని అడ్డగించే ప్రయత్నం చేశారు. దీంతో కొత్త పాపయమ్మ అనే మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. వెంటనే అధికారులు పోలిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారికి సమాచారం ఇవ్వడంతో ఆయన వెంటనే చేరుకొని ఆమెకు వైద్యం చేశారు. అనంతరం ఆర్డీవో ఆ మహిళను తన వాహనంలో ఆసుపత్రికి తరలించారు. మంగళవారం రాత్రి అధికారులు చెట్లు తొలగిస్తున్న సమయంలో అడ్డుపడిన దల్లి లక్ష్మి అనే మహిళ కూడా సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో ఆమెను విజయనగరంలో ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతోంది.
భూసేకరణను అడ్డుకున్నందుకు రైతులపై కేసు నమోదు
బైరెడ్డి పాలెంలో అప్రోచ్ రోడ్డు భూసేకరణను అడ్డుకున్న రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం చెట్లను తొలగించేందుకు వెళ్లిన అధికారుల విధులకు ఆటంకలిగించినందుకు విఆర్‌ఒ శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దల్లి లక్ష్మి, బైరెడ్డి ఎర్రయ్య, కనకరాజు తో పాటు మరి కొంతమంది రైతులపై కేసులు నమోదు చేశారు.










