Aug 02,2023 00:11

ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసనలో రైతులు, నాయకులు

ప్రజాశక్తి - సత్తెనపల్లి రూరల్‌ : భూములు కోల్పోయిన రైతులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే పరిహారం నిర్ణయించాలని రైతుసంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాలరావు డిమాండ్‌ చేశారు. కొండమోడు-పేరేచర్ల 167ఎజి జాతీయ రహదారి విస్తరణలో భూములు కోల్పోతున్న రైతులతో రైతు సంఘం నాయకులు సమావేశమయ్యారు. అనంతరం రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి ఆర్‌డిఒ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా గోపాలరావు మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు నాలుగు రెట్లు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కొంతమంది ఇళ్ళ స్థలాలు కొనుగోలు చేసినప్పటికీ కన్వర్షన్‌ కాలేదనే కారణంగా వాటిని వ్యవసాయ భూములుగా పరిగణించుటం వలన తీవ్ర నష్టపోతున్నారని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, రైతులకు ఆమోదయోగ్యమైన పరిహారం చెల్లించాలని కోరుతూ ఆర్డీఓ బిఎల్‌ఎన్‌ రాజకుమారికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జి.బాలకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు జి.చలమయ్య, సిపిఎం మండల కార్యదర్శి పి.మహేష్‌, రైతులు అవ్యారు ప్రసాదరావు, గోరంట్ల విష్ణు వర్ధనరావు, యెలినేడి రామారావు, వెంకటేశ్వరరావు, కంచేటి శేషగిరిరావు, పసుపులేటి రామకృష్ణ పాల్గొన్నారు.