Nov 22,2022 22:43

ప్రజాశక్తి - ముదినేపల్లి
              వాతావరణ మార్పులు రైతులను కలవరపెడుతున్నాయి. మూడు రోజులుగా ఆకాశంలో మబ్బులు కమ్ముకుని చలిగాలులు వీచడంతో పాటు చిరుజల్లులు పడటంతో మండలంలోని రైతులు కోసిన వరిపైరును రక్షించుకునే పనుల్లో నిమగమయ్యారు. ప్రస్తుతం మండలంలో వెయ్యి ఎకరాల్లో వరి కోతలు పూర్తయ్యాయి. 200 ఎకరాల్లో పైరు పనలపై ఉంది. దీంతో రెండు రోజులుగా పడుతున్న చిరుజల్లులతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. పనలపై ఉన్న పైరును కూలీలతో బయటకు తీసుకువచ్చి మాసూలు చేస్తున్నారు. చేతికి వచ్చిన పంట దక్కకుండా పోతుందేమోననే భయంతో రైతులు పనలపై ఉన్న పైరును రక్షించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ముదినేపల్లి, చిగురుకోట, వడాలి, నరసన్నపాలెం, పెదకామనపూడి, సింగరాయపాలెం తదితర గ్రామాల్లో యంత్రాలతో ముమ్మరంగా కోతలు జరుగుతున్నాయి. వర్ష భయంతో రైతులు ఉరుకులు పరుగులు పెడుతూ వరిపైరును రోడ్లపైకి కూలీలతో తీసుకువచ్చి ట్రాక్టర్లతో నూర్పిళ్లు చేస్తూ పంటను రక్షించుకునే పన్నుల్లో నిమగమయారు.
ఉంగుటూరు:బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న తేలికపాటి వర్షాలకు రైతులు ఆందోళన చెందుతున్నారు. మూలిగే నక్క మీద తాటిపండు పడిన చందంలా ధాన్యం రైతుల పరిస్థితి తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలులో సాంకేతిక సమస్యలు ఒక పక్క, సరిపడు లారీలు లేక మరోపక్క ధాన్యం కల్లాల్లోనే ఉండిపోయింది. దీంతో చిన్నపాటి వర్షానికి ధాన్యం తడిసిపోతుందని వాపోతున్నారు. ఉంగుటూరు మండలంలో 24వేలకు పైగా ఎకరాల్లో ఖరీఫ్‌ సాగు చేశారు. ఇప్పటి వరకూ 19,800 ఎకరాల్లో వరి కోతలు పూర్తయ్యి 53,499 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. అందులో ఇప్పటి వరకూ 25 ఆర్‌బికేల ద్వారా కేవలం 12,339 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలుచేశారు. 5,86,380 సంచులను రైతులకు ఇప్పటి వరకు పంపిణీ చేశారు. పలు గ్రామాల్లో ధాన్యం సంచుల్లో పట్టి వారం రోజులు దాటినా పలు కారణాల వల్ల మిల్లులకు చేరకపోవడంతో రైతులు వాటికి కాపాలాగా కల్లాల వద్ద ఉంటున్నారు. చినుకుల నుంచి రక్షణకు బరకాల కొరత వేధిస్తోందని కర్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యాన్ని వెంటనే మిల్లులకు చేరవేసేలా రవాణా సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు.