Dec 13,2022 23:56

తుపాను దెబ్బతిన్న వరి పైరును చూపుతున్న అప్పలరాజు, తదితరులు

ప్రజాశక్తి -యస్‌.రాయవరం: మాండూస్‌ తుఫాన్‌ కారణంగా పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలరాజు డిమాండ్‌ చేశారు. మండలంలోని గుడివాడ రెవెన్యూ పరిధిలోని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.సత్యనారాయణతో కలిసి నీటి మునిగిన వరి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎం.అప్పలరాజు మాట్లాడుతూ, వెంటనే నష్టపోయిన పంటలను వ్యవసాయ శాఖ, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. కోసిన వరి పంట నష్టపోయిన దానికి నష్టపరిహారం చెల్లించబడదని జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ప్రకటించడం రైతులను మరింత ఆందోళనకు గురి చేస్తోందని తెలిపారు. పంట ఏ స్థాయిలో నష్టం జరిగినా రైతులు నష్టపోయినట్టేనని తెలిపారు. ఏ మాత్రం శాస్త్రీయతలేని పద్దతులను వ్యవసాయశాఖ అధికారులు పరిగణనలోకి తీసుకుని రైతులకు నష్టపరిహారం ఎగ్గొట్టే విధంగా చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా వ్యవసాయ, రెవెన్యూ అధికారులు పంటల నష్టాన్ని పరిశీలించడానికి క్షేత్రస్థాయికి వెళ్లాలని సూచించారు. గుడివాడ రెవెన్యూ పరిధిలోని పంటలు పరిశీలించారు.అప్పు లు చేసి పెట్టుబడి పెట్టామని రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.ఈ కార్యక్రమంలో మామిడి నానాజీ, మైలపల్లి లోవరాజు, పిక్కి రాజు, కోడా అప్పలరాజు, కోడా మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.