ప్రజాశక్తి-ఆలూరు
వైసిపి ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి సి.నారాయణ రెడ్డి విమర్శించారు. సోమవారం స్థానిక టిడిపి కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. 2018 నష్టపరిహారం ఇవ్వకుండా ఇతర పథకాలకు మళ్లించారని తెలిపారు. ఆర్‌బికెల్లో రైతులకు విత్తనాలు, ఎరువులు సరఫరా చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. అధిక వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టో రైతులకు భరోసా కల్పిస్తుందని అన్నారు. అన్నదాత పథకం ద్వారా ప్రతి రైతుకు రూ.20 వేల సహాయం అందిస్తామని తెలిపారు. 5 కోట్ల మంది ప్రజలకు భవిష్యత్తుపై భరోసా ఇస్తూ ఆరు పథకాలను చంద్రబాబు ప్రకటించడంతో ప్రజల నుంచి ఆదరణ లభిస్తోందని చెప్పారు. ఆలూరు నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న వేదవతి, నగరడోన ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. తాగు, సాగునీరు, రహదారులు అధ్వానంగా ఉన్నా పట్టించుకోరా అని ఆయన ప్రశ్నించారు. టిడిపి జిల్లా నాయకులు నరసప్ప, భాస్కర్, కొమ్ము రామాంజి, నాగరాజు, చంద్రశేఖర్, టిడిపి సినియర్ నాయకులు ముద్ద రంగ, గూళ్యం రామాంజినేయులు, ఆంజనేయ్య, జిలన్ బాషా, మాసాల జగన్, హనుమప్ప పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న నారాయణ రెడ్డి










