Mar 19,2023 23:44
ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తున్న పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, టిడిపి నాయకులు

ప్రజాశక్తి-మార్టూరు రూరల్‌: రైతు ప్రభుత్వం అని గొప్పలు చెబుతున్న వైసిపి ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేస్తోందని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంటు అధ్యక్షుడు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. ఆదివారం ఎపి రాజధాని అమరావతిలోని సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్ద టీడీపీ శాసనసభాపక్ష నేతలతో నిరసన వ్యక్తం చేశారు. ఏపీలో విద్యుత్‌ బాదుడు, స్మార్ట్‌ మీటర్ల పేరుతో రైతుల మెడకు ఉరితాళ్లు బిగిస్తున్నారంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఏలూరి మాట్లాడుతూ జగన్‌ సీఎం అయ్యాక రైతులకు అనేక ప్రయోజనాలు అందిస్తున్నట్లు ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్నారే తప్ప వాస్తవానికి వైసిపి ప్రభుత్వం వల్ల రైతులకు ఒరిగిందేమీ లేదని ఏలూరి విమర్శించారు. రైతాంగాన్ని ఆదుకోవడంలో వైసిపి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. సీఎం అనాలోచిత నిర్ణయాల వల్ల పవర్‌ సెక్టార్‌ కుప్పకూలిందని పేర్కొన్నారు. రైతులకు ఉచిత విద్యుత్‌ను ఎత్తివేసేందుకే విద్యుత్‌ మోటార్లకు మీటర్లు బిగించే స్కీంను దుర్మార్గంగా ఈ ప్రభుత్వం అమలు చేసేందుకు కుట్రలు పన్నుతోందని అన్నారు. అన్నదాతలకు నష్టం కలిగే ఏ నిర్ణయం అయినా తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తుందని ఏలూరి పేర్కొన్నారు.