ప్రజాశక్తి-తుళ్లూరు : రైతులను సిఎం జగన్ మోసం చేశారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర ఆదివారం గుంటూరు జిల్లా మేడికొండూరు, తాడికొండ మండలాల్లో జరిగింది. రావెల శివార్లలో 'అమరావతి ఆవేదన' పేరుతో రాజధాని రైతులతో ముఖాముఖి నిర్వహించారు. లోకేష్ మాట్లాడుతూ ఆనాడు అమరావతికి జై అన్న జగన్... నేడు కులం పేరుతో నిర్వీర్యం చేశారన్నారు. మూడు రాజధానులని చెబుతూనే ఎక్కడా ఒక్క భవనం నిర్మించలేదన్నారు. మూడు రాజధానులన్న వ్యక్తి 3 ఇటుకలైనా వేశాడా? అని ప్రశ్నించారు. హైకోర్టు మార్పుపై కనీసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపలేదని, ఇప్పుడు వైజాగ్ ప్రజలను కూడా వైసిపి ప్రభుత్వం మోసం చేస్తోందని అన్నారు. వైసిపి అధికారిక ట్విట్టర్‌లో రిషికొండపై సచివాలయం కడుతున్నారని చెప్పిన 2 గంటల్లోనే పోస్టు తొలగించారన్నారు. కర్నూలు ప్రజల్ని, అమరావతి రైతులను జగన్ మోసం చేశాడన్నారు. విశాఖ ప్రజలు కూడా జగన్ మోసాన్ని గ్రహించాలన్నారు. మహిళల కన్నీటితోనే జగన్ ప్రభుత్వం భూస్థాపితం అవుతుందన్నారు. జగన్ మాటలకు ఆనాడు అందరూ మోసపోయారని, అధికారంలోకి వచ్చాక మరో మాట మాట తప్పి, మడమతిప్పారని విమర్శించారు. రాజధాని మహిళలను జుట్టుపట్టుకుని ఈడ్చారు... బూటుకాళ్లతో తన్నారు... వెయ్యిమందిపై తప్పుడు కేసులు బనాయించారు... అమరావతి రైతుల త్యాగాలు వృథాగా పోవు అని అన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్లరామకృష్ణారెడ్డి కూడా ఎన్నికల్లో గెలవడం కోసం 2019లో రాజధాని ఎక్కడికి పోదు.. వైసిపి అధికారంలోకి వస్తే అభివృద్ధి చేస్తామన్నారని, అది ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు.
అమరావతి నుండే వైసిపి పతనం : ఎమ్మెల్యే శ్రీదేవి
ఇదిలా ఉండగా లోకేష్ యువగళంలో వైసిపి ఎమ్మెల్యే వుండవల్లి శ్రీదేవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తాడికొండ నియోజకవర్గంలోని రావెలలో రాజధాని రైతులతో ముఖాముఖి నిర్వహించగా కార్యక్రమం ప్రారంభం అవుతున్న సమయంలో శ్రీదేవి అనూహ్యంగా వేదిక పైకి వచ్చారు .సభ ముగిసే వరకూ లోకేష్‌తో పాటు శ్రీదేవి ఒక్కరే ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేను మీ వైపే..నా ప్రాణం పోయినా అమరావతి వైపే ఉంటా అని అన్నారు. అమరావతి నుంచే వైసిపి పతనం మొదలవుతుందని, రాజధాని ప్రాంతం మందడంలో ఇసుక డాన్‌ను దించారని, మూడు రాజధానుల శిబిరాన్ని ఏర్పాటు చేయించారని అధికార పార్టీ ఎంపిపై పరోక్ష విమర్శలు చేశారు.
అమరావతి మహిళల ఆవేదన
పద్మ అనే మహిళ మాట్లాడుతూ 'రాజధాని లేదని భూములిచ్చాం.. మా భూముల్లో రాజధాని నిర్మాణం మొదలు పెట్టారు.. ఈ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానులను వ్యతిరేకించాం.. ఉద్యమం చేసే సమయంలో దుర్గ గుడికి మొక్కలు చెల్లించుకోవడానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. ఎవడివ్వమన్నారే భూములు అని పోలీసులు మాట్లాడారు. కడుపు నిండా అన్నం తిని, కంటి నిండ నిద్రపోయి నాలుగేళ్లు అయింది. దుర్భాషలాడి రోడ్డుపై ఈడ్చారు. పెయిడ్ ఆర్టిస్టులని మమ్మల్ని అవమానించారు.. మా బాధలు చెప్పుకోవడానికి బయటకు వస్తే కొట్టారు..' అని ఆవేదన వ్యక్తం చేశారు. తాటినేని రాజేశ్వరి మాట్లాడుతూ 'మేము నాలుగెకరాలిచ్చాం. అరసవెల్లి పాదయాత్రకు వెళ్తుంటే మమ్మల్ని కొట్టేందుకు రాజమండ్రిలో రాళ్లు, పెట్రోల్ బాటిళ్లు విసిరారు. అయినా తగ్గకుండా వెళ్తుంటే కొట్టారు..' అని వివరించారు. భూక్యా నాయక్ మాట్లాడుతూ 'నేను రాజధానికి అరెకరం పొలం ఇచ్చాను. పోలీసులు తెల్లవారుజామున తీసుకువెళ్లి వేధించారు. నోరు లేని మా అబ్బాయిని బూతు కాళ్లతో తొక్కారు. తెనాలి తీసుకెల్లి మంగళగిరి తీసుకొచ్చారు. మేము ఏం పాపం చేశాం.. పనిచేసుకుని బతికే వాళ్లం.. ఎన్నో విధాలుగా హింసలు పెట్టారు. ఇంట్లో మహిళ బాధతో ఉందన్నా వినకుండా పోలీసులు తీసుకెళ్లారు..' అని చెప్పారు. అంకం స్వర్ణ కమల మాట్లాడుతూ '70 సెంట్ల అసైన్డ్ భూమిని రాజధానికి ఇచ్చాను. అసైన్డ్ రైతులకు కౌలు కూడా ఇవ్వడం లేదు..' అని అవేదనకు గురయ్యారు. వెలగపూడికి చెందిన రైతు కంచర్ల గాంధీ మాట్లాడుతూ 'ప్రజాప్రతినిధులు, అధికారులు మమ్మల్ని భూములివ్వాలని ఒత్తిడి చేశారు. ఇప్పుడు మేము ఇన్ని కష్టాలు పడుతుంటే వాళ్లంతా ఎక్కడున్నారు?' అని నిలదీశారు. రాయపూడికి చెందిన సాహెబ్ జాన్ అనే రైతు మాట్లాడుతూ భూములు తీసుకొని కౌలు ఎందుకు ఇవ్వరని నిలదీశారు. తుళ్లూరు మాజీ సర్పంచ్ నరసింహారావు మాట్లాడుతూ ఎక్కడో ఉన్న వారిని రాజధానిలో కాకుండా వారి సొంత ఊరిలో 3 సెంట్లు స్థలం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనంద్‌బాబు, మాకినేని పెదరత్తయ్య, టిడిపి తాడికొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జి తెనాలిశ్రావణ్ కుమార్, అమరావతి ఉద్యమ నాయకులు పువ్వాడ సుధాకర్, గద్దె తిరుపతిరావు, ఆళ్ల శివారెడ్డి, కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
నేటిపాదయాత్ర వివరాలు
ఉదయం 8 గంటలకు రావెెల శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం
10 గంటలకు పొన్నెెకల్లులో ముస్లిములతో సమావేశం
11 గంటలకు తాడికొండ అడ్డరోడ్డులో స్థానికులతో సమావేశం
11.45 గంటలకు తాడికొండ శివార్లలో ఆడిటర్లతో ముఖాముఖి
మధ్యాహ్నం 12.45 గంటలకు తాడికొండ శివార్లలో భోజన విరామం
సాయంత్రం 4 గంటలకు తాడికొండ శివార్ల నుంచి పాదయాత్ర కొనసాగింపు
5 గంటకు తాడికొండ ఎన్‌టిఆర్ సర్కిల్లో స్థానికులతో మాటామంతి
రాత్రి 8 గంటలకు కంతేరులో స్థానికులతో సమావేశం
9.30 గంటలకు నిడమర్రు శివారు విడిది కేంద్రంలో బస










