
రైతులను, కూలీలను ఆదుకోవాలి
ఏపీ రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు
ప్రజాశక్తి - విలేకరులు
కొత్తపల్లి: కొత్తపల్లిని కరువు మండలంగా ప్రకటించి రైతులను, వ్యవసాయ కూలీలను ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రాజశేఖర్, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ స్వాములు డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రమైన కొత్తపల్లిలో తహసిల్దార్ కార్యాలయం ముందు ఏపీ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మండలంలో సకాలంలో సరైన వర్షాలు లేక పంటలన్నీ దెబ్బతిన్నా యన్నారు. చెడగొట్టిన పంటలను వ్యవసాయ శాఖ అధికారులు ఈ క్రాప్ కూడా నమోదు చేయలేదని, మండలంలో కరువు పరిస్థితులు ఏర్పడి రైతులు అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి, వ్యవసాయ కూలీలకు అదనంగా వంద రోజులు ఉపాధి పనులు కల్పించాలని ప్రతి పేద కుటుంబానికి 20వేల రూపాయలు ఆర్థిక సాయం అందించి ఆదుకోని, నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలని కోరారు. పార్లమెంటులో అన్ని పంటలకు మద్దతు ధర చట్టం చేయాలని 660 జీవోను రద్దుచేసి పంటల బీమాను ప్రభుత్వమే అమలు చేయాలని, శ్రీశైలం బ్యాక్ వాటర్ పై ఎత్తిపోతల పథకాలను నిర్మించి కొత్తపల్లి మండలంలోని మెట్ట భూములకు సాగునీరు అందించాలని, లిఫ్టుల ద్వారా మండలంలోని చెరువులను నింపాలని భూముల ఆన్లైన్ సమస్యలను పరిష్కరించాలని తదితర డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసిల్దార్ చంద్రశేఖర్ నాయక్‌కు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ఎస్ సంజీవ రాయుడు, జి దాసు, జ్ఞాన సూర్యుడు, దినేష్, వెంకటేశ్వర్లు, చిన్న చిన్నయ్య, పాపన్న తదితరులు పాల్గొన్నారు. బేతంచెర్ల: బేతంచెర్లను కరువు మండలంగా ప్రకటించాలని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వి సుబ్బరాయుడు ప్రభుత్వాన్ని కోరారు. మండల రైతు సంఘం అధ్యక్షులు సీతామాపురం జి. వెంకటేశ్వర్లు అధ్యక్షతన రైతులతో కలిసి మండల తహశీల్దార్ నరేంద్రనాధ్ రెడ్డికి సమస్యలతో కూడిన వినతిపత్రంను అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడారు. మండలంలో ఉన్న గూటుపల్లె చెరువుగోర్లగుట్ట చెరువు నాగమళ్ళకుంట, ముసలాయి చెరువు, ముద్ద వరం దాసి చెరువు, మర్రికుంట, ఇతర గ్రామాల కుంటలలో వర్షాలు పడనందువల్ల చుక్క నీరు నిల్వలేదన్నారు. హంద్రీ నీవా సుజల స్రవంతి నీటి కాలువ ద్వారా, ఎత్తిపోతలతో మండలం లోని గూటుపల్లె చెరువుకు, కుంటలకు నీటితో నింపాలని కోరారు. అనంతరం సర్వోత్తమ రెడ్డి, నారాయణ,ఎం. గోవిందు, కిట్టు, షాషా, మద్దయ్య, మోహన్, రాజు తదితర రైతులు పాల్గొన్నారు. ఆత్మకూరు : ఆత్మకూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను వ్యవసాయ కూలీలను ఆదుకోవాలని ఏపీ రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆత్మకూరు తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం మండల అధ్యక్షులు మాబాష, కార్యదర్శి వీరన్న,కార్యదర్శి ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నరసింహ నాయక్, వాకిటి పేట కౌలు రైతు సంఘం అధ్యక్షులు ఆశ్రఫ్ అలీ మాట్లాడారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తాసిల్దార్ ఉమారాణికి ఇచ్చారు. రైతు సంఘం నాయకులు పాలశివుడు, జి నాగేశ్వరావు, అంబయ్య, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. నందికొట్కూరు టౌన్: వర్షాభావం పరిస్థితుల వల్ల నష్టపోయిన అన్ని పంటలకు నష్టపరిహారం చెల్లించాలని రైతు సంఘం జిల్లా నాయకులు బెస్త రాజు, వ్యాకాసం జిల్లా నాయకులు సాహెబ్ డిమాండ్ చేశారు. ఈమేరకు వారు స్థానిక తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి డిమాండ్లతో తాసిల్దార్ రాజశేఖర్ బాబు వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి టీ గోపాలకృష్ణ, నాగన్న, మహిళా సంఘం నాయకురాలు సోడా బిబి, సాయిదాబి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వెంకటేశ్వర్లు, పకీరయ్య నరసింహ, రైతు సంఘం నాయకులు మధు నాయుడు, సీతారాముడు నాగ లచ్చమ్మ, లక్ష్మీదేవి రైతులు వ్యవసాయ కూలీలు పాల్గొన్నారు. జూపాడుబంగ్లాలో.. మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని రైతు సంఘం మండల అధ్యక్షులు ఏసన్న అధ్యక్షతన తాసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. అనంతరం తాసిల్దార్ పుల్లయ్య యాదవ్‌కి వినత పత్రం ఇచ్చారు. పాములపాడు : పాములపాడు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి ఖరీఫ్ సీజన్ పంట నష్టపరిహారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఏపీ రైతు సంఘం సీనియర్ నాయకులు జిల్లా ఉపాధ్యక్షులు బి రామేశ్వరరావు, కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సామన్న, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు బాలయ్య, రైతు సంఘం మండల కార్యదర్శి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. తాసిల్దార్ కార్యాలయం ఎదుట రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డారు. అనంతరం తాసిల్దార్ రత్న రాధికకు వినతిపత్రం అందజేశారు. మాల మహానాడు జిల్లా నాయకులు అంకన్న, రైతు సంఘం నాయకులు బాల యేసు,ఆంజనేయులు, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. మిడుతూరు: మిడుతూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం నాగేశ్వరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎంపిడిఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం నాగేశ్వరావు మాట్లాడుతూ మిడుతూరు మండలంలో వర్షాభావ పరిస్థితుల మూలంగా పంటలు దెబ్బతిన్నాయని రైతులను ఆదుకునేందుకు ఎకరాకు రూ.50 వేల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని, బ్యాంకు రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీవోకు, డిప్యూటీ తాసిల్దార్‌కు వినతి పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో వి రామకృష్ణ, రైతు సంఘం కార్యదర్శి బి మదిలేటి, రమణయ్య, శివరాముడు, శేఖరు, రామకృష్ణ, వెంకటస్వామి, షేక్షావలి, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు టి ఓబులేసు, కెవిపిఎస్ నాయకులు లింగస్వామి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు డక్క కుమార్ తదితరులు పాల్గొన్నారు. పగిడ్యాల : రైతు సంఘం నాయకులు ఈశ్వరమ్మ ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈశ్వరమ్మ మాట్లాడారు. తక్షణమే రైతు సమస్యలను పరిష్క రించకపోతే ఆందోళనలు చేపడతామని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు.