ప్రజాశక్తి - ద్వారకాతిరుమల
రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మండలంలోని బుట్టాయగూడెం పంచాయతీ నారాయణపురం రైతు భరోసా కేంద్రాన్ని తనిఖీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ధాన్యం సేకరణ చేపట్టాలన్నారు. రైతు భరోసా కేంద్రం వద్ద సంబంధిత అధికారులు అందుబాటులో ఉంటూ ధాన్యం సేకరించాలని సూచించారు. తేమశాతం, గోనె సంచులు, ధాన్యం రవాణా సౌకర్యం, మిల్లులకు చేరవేత తదితర వివరాలను సిబ్బందిని అడిగితెలుసుకున్నారు. ధాన్యాన్ని మిల్లులకు తరలించే పనులు వేగవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్నరైతులతో ధాన్యం సేకరణకు సంబంధించిన అంశాలపై కలెక్టర్ మాట్లాడారు. తేమశాతం గుర్తించడాన్ని అడిగి తెలుసుకున్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ధాన్యం సేకరణకు చర్యలు తీసుకుందన్నారు. గోనె సంచుల విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ద్వారకాతిరుమల మండలంలో ఆరు రైతు భరోసా కేంద్రాల పరిధిలో 4,851 ఎకరాల వరి విస్తీర్ణం కాగా 13,268 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని తహశీల్దార్ సుందర్‌సింగ్, వ్యవసాయశాఖ సిబ్బంది తెలిపారు. మండలంలో 8,808 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలన్న లక్ష్యానికి ఇంతవరకు 5,240 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. ఈ పర్యటనలో గ్రామ సర్పంచి కేతా సుబ్రహ్మణ్యం, ఎంపిడిఒ కెవి.సుబ్బరాయన్ ఉన్నారు.










