Oct 20,2023 21:49

ఎడమ ప్రధాన కాలువకు అడ్డుకట్ట వేయడంతో నిల్వ ఉన్న నీరు

ప్రజాశక్తి - మక్కువ :  చీమంత చినుకు పడిన చాలు కొండంత నష్టం నుంచి గట్టెక్కవచ్చని ఓవైపు ఆకాశం వైపు ఆత్రంగా చూస్తున్న అన్నదాత.. మరోవైపు కాలువలు చెంత ఉన్నా చుక్క నీరందక శివారు ఆయకట్టు రైతన్న ఆందోళన చెందుతుంటే.. దర్జాగా ప్రాజెక్టుకు కిలోమీటరు దూరాన కాలువలో పూనుగట్టి నీటిని అక్రమంగా చేపల చెరువులకు పట్టుకెళ్తున్నా అధికారులెవరూ పట్టించుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళ్తే...
మండలం లోని వెంగళరాయ సాగర్‌ ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువలో అక్రమంగా అడ్డంగా గట్టు వేసి నీటిని సమీపంలో ఉన్న చేపల చెరువులకు తీసుకుపోతున్నారు. ప్రాజెక్టుకు కూతవేటు దూరంలో ఇలా అక్రమాలు జరుగుతున్నప్పటికీ అధికారులెవరూ పట్టించుకోక పోవడంపై పలు విమర్శలకు తావిస్తోంది. సుమారు 20 ఎకరాల్లో చేపల చెరువులో ఈ ప్రాంతంలో ఉన్నాయి. అయితే వాటిని వినియోగించాల్సిన విద్యుత్‌ మోటార్లు పనిచేయలేదని స్థానిక కూలీలు తెలుపుతున్నారు. పూను వేసి నీటిని దిగువ ప్రాంతంలో కొంతమంది శంబర గ్రామానికి చెందిన రైతులు కూడా ఇలాగే తీసుకుపోతున్నారని వారు అంటున్నారు. ఇప్పటికే శివారు భూమి రైతులకు సాగునీరందక అవస్థలు పడుతున్నారు. చాలీచాలని నీటితో రైతులు కొట్లాడుకుంటూ సాగునీటిని వినియోగించుకుంటున్నారు. అయితే అక్రమదారులకు మాత్రం అధికారులు సాగు కోసం వినియోగించాల్సిన నీటిని అవినీతికి అలవాటు పడి చేపల చెరువులకు వదిలేస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎల్‌ఎంసి కాలువకు లైనింగ్‌ పనులు లేకపోవడం, మరోవైపు కాలువలు పూర్తిగా పూడికపేరుకుపోవడం శివారు ఆయకట్టు భూములకు నీరందక మార్కొండపుట్టి, బంగారువలస, కోన పంచాయతీ రైతులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమంగా కాలువల్లో అడ్డుకట్టలు తొలగించి దొంగచాటుగా సాగునీటిని వినియోగిస్తున్న వారిపైనా, కాలువలపై పర్యవేక్షణ కొరవడిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.