ప్రజాశక్తి - కర్నూలు కార్పొరేషన్
స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం మరోసారి రైతులను దగా చేసిందని ఎపి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. శనివారం కర్నూలు నగరంలోని కార్మిక, కర్షక భవన్‌లో ఎపి రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు కె.వెంకటేశులు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఈనెల 7న ప్రకటించిన మద్దతు ధరతో రైతులను మరోసారి మోసం చేసిందని మండిపడ్డారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని తెలిపారు. ఈనెల 7న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రైతులకు కంటి తుడుపు చర్యగా ఉందని, న్యాయసమ్మతంగా లేదని చెప్పారు. పెట్టుబడి ఖర్చులు 50 నుంచి 200 శాతం పెరగగా పత్తి, జొన్న లాంటి పంటలకు అత్యంత తక్కువ మద్దతు ధర ప్రకటించి రైతులను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి పంటపైనా రైతులు నష్టపోతున్నారని, దిగుబడి రాక ధర లేక ప్రకృతి వైపరీత్యాలతో, పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరిగి, వ్యవసాయం చేయలేక, భూములు వదులుకొని ఇతర వృత్తులు చేసుకునే పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు. కొంతమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ ప్రతిపాదించిన పెట్టుబడిపై 50 శాతం కనీస మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే రైతులు బిజెపి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. అనంతరం రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ మాట్లాడారు. ఈనెల 30న జరిగే విజయవాడ మహాధర్నాకు రైతుల సమస్యలపై తరలి వెళ్లాలని కోరారు. జాతీయ రహదారుల్లో భూములు కోల్పోతున్న రైతులు, ఆర్‌డిఎస్, వేదవతి కోసం భూములు కోల్పోయిన రైతులకు న్యాయమైన నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంటల బీమా రైతులందరికీ ఇవ్వాలని, నకిలీ విత్తనాలను అరికట్టి నాణ్యమైన విత్తనాలు ఇవ్వాలని కోరారు. సాగునీటి ప్రాజెక్టులను తక్షణమే నిర్మించేందుకు ప్రభుత్వం పూనుకోవాలని, విజయవాడ ధర్నాకు పెద్ద ఎత్తున రైతులు తరలి రావాలని కోరారు. రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పి. హనుమంతు, రాష్ట్ర కమిటీ సభ్యులు వనజ, జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు, మధు, సిద్ధయ్య గౌడ్, లక్ష్మీ నరసయ్య పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న ప్రభాకర్ రెడ్డి










